వైఎస్ జగన్ బాబాయి ఇలా బుక్కయ్యారేమిటి !

 

వైఎస్ జగన్ బాబాయి ఇలా బుక్కయ్యారేమిటి !

 
రాజకీయాల్లో ఈరోజు మాట్లాడిన మాట రేపు చెల్లదు.  నేతలు సైతం ఈరోజు ఒక విషయం మాట్లాడేటప్పుడు నిన్న అదే విషయం గురించి ఏం  మాట్లాడాం అనే సంగతిని స్పృహలో ఉంచుకోరు.  ఏ పనిలో అయితే గత ప్రభుత్వాలను తప్పుబట్టారో అదే పనిని అధికారంలోకి రాగానే నిస్సంకోచంగా చేసేస్తుంటారు.  ప్రస్తుతం టీటీడీ పాలకమండలి చైర్మన్, స్వయానా సీఎం వైఎస్ జగన్ యొక్క బాబాయి వైవీ సుబ్బారెడ్డిగారి తీరు ఇలానే ఉంది.  
 
శ్రీవారికి సంబంధించి తమిళనాడులో పలుచోట్ల ఉన్న 23 ఆస్తులను అమ్మకానికి పెట్టారు.  అవన్నీ నిరర్థక ఆస్తులని అందుకే అమ్ముతున్నామని వైకాపా నేతలు, టీటీడీ పాలకమండలి సభ్యులు అంటున్నారు.  అసలు భక్తులు సమర్పించిన ఆస్తులను అమ్మే హక్కు పాలకమండలికి లేదని, కేవలం నిర్వహణ భాద్యత మాత్రమే వారిదని విమర్శలు వెల్లువెత్తాయి.  కానీ తాము అమ్మాలని అనుకుంటున్న ఆస్తులను గతంలో టీడీపీ హయాంలోనే అమ్మాలని అనుకున్నారని, అపట్లో చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన పాలకమండలి ఆస్తులకు సంబంధించి సబ్‌రిజిస్టార్‌ కార్యాలయాల రికార్డుల్లోని విలువ, బహిరంగ మార్కెట్‌ విలువలను సేకరించి పెట్టారని సమాధానం ఇచ్చారు.  
 
కానీ ఇదే ఆస్తుల అమ్మకం విషయంలో టీడీపీని ఇప్పటి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిగారు మామూలుగా విమర్శించలేదు.  దేవుళ్ళనే మింగేయాలనే కార్యక్రమం ఈ (టీడీపీ) ప్రభుత్వం చేపట్టింది.  దైవ కార్యక్రమాల పేరుతో దోపిడీ చేస్తున్నారు అంటూ భగవద్గీతలోని ధర్మో రక్షతి రక్షితహ అనే వాఖ్యాన్ని ఉటంకిస్తూ ఈ అధర్మ పాలనను మనం క్షమిస్తే అది మనల్నే మింగేస్తుంది.  ప్రజల ఆస్తులను, దేవుడి ఆస్తులను మింగేసే వరకు వచ్చింది కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి అంటూ మట్లాడారు.  
 
ఈ వీడియోను వెతికి పట్టుకున్న నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇదేమిటని ప్రశ్నిస్తున్నారు.  ఇక టీడీపీ అనుకూల మీడియా కూడా తన పని స్టార్ట్ చేసింది.  అప్పట్లో సూక్తులు.. ఇప్పుడు అమ్మకాలా అంటూ కథనాలు స్టార్ట్ చేశాయి.  మొత్తం మీద వైవీ సుబ్బారెడ్డిగారి గత వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే కౌంటర్లు పడేలా చేస్తున్నాయి.