రాత్రి పబ్జీ.. పొద్దున సైకో.. జగన్ మీద లోకేష్ అభిప్రాయం

నారా లోకేష్ ఇంతకు ముందులా లేరు.  ఆయన వర్కింగ్ స్టైల్, మాట తీరు రెండూ మారాయి.  2019 ఓటమి తర్వాత కూడా ఇంతలా మారని లోకేష్ టీడీపీ నేతల వరస అరెస్టులతో మరింత యాక్టివ్ అయ్యారు.  ఈ హుషారు వెనుక నాయకత్వానికి సంబంధించి వేరే కారణాలున్నా ఆయన వైసీపీ మీద విరుచుకుపడుతున్న తీరు కొత్తగా ఉంది.  అరెస్టు కాబడిన నేతల కుటుంబాలను పరామర్శించే బాద్యత తీసుకున్న లోకేష్ మొన్నామధ్య తాడిపత్రి వెళ్లి జేసీ కుటుంబాన్ని కలిసి మాట్లాడి, ఓదార్చి, ధైర్యం చెప్పి వచ్చారు.  ఈరోజు అచ్చెన్నాయుడు కుటుంబాన్ని కలిసి మాట్లాడారు.  ఈ సంధర్భంగా ఆయన చేసిన విమర్శలు చాలా ఘాటుగా ఉన్నాయి. 
 
 
జగన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపులకి పాల్పడుతుందని స్టార్ట్ చేసిన ఆయన 33 మంది టీడీపీ నేతలపై దొంగ కేసులు పెట్టారని, దాదాపు వెయ్యి మంది కార్యకర్తలపై కేసులు పెట్టారని ఆరోపించారు.  లోకేష్ ను జైల్లో వేస్తామని చంకలు గుద్దుకున్న వారంతా అసలు ఫైబర్ గ్రిడ్ ఏ శాఖ కిందికి వస్తుందో తెలుసుకోవాలని, ఇలాంటి మంత్రులు, ఎమ్మెల్యేల వలన తనకు తలనొప్పి అయిందని వ్యంగ్యంగా మాట్లాడారు.  బీసీల కోసం పోరాడుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే బాహుబలి లాంటి అచ్చైన మీద అక్రమ కేసులు పెట్టారని అన్నారు. 
 
 
జగన్ రెడ్డిగారు రాత్రంతా పబ్జీ ఆడుతూ పొద్దున సైకోలా మారుతున్నారని ఎద్దేవా చేశారు.  జగన్ రెడ్డిలా అచ్చెన్న ఆర్థిక నేరస్థుడు కాదని, ఆయన్ను టెర్రరిస్టులా అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు.  ఏపీ బిహార్‌లా మారిపోయిందని, మన రాష్ట్రం ఏమైపోతోందోనని బాధగా ఉందని అన్నారు. ఏ ఒక్కర్నీ కూడా తాము వదలమని, అన్నీ రాసుకుంటున్నామని, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని చెప్పారు.  దేవుడు ఉన్నాడని, అన్నీ చూస్తున్నాడని  దేవుడి స్క్రిప్ట్ ప్రకారమే తాము అధికార పార్టీకి అన్నీ వడ్డీతో సహా చెల్లిస్తామని నారా లోకేష్ హెచ్చరించారు.