ఏపీ ప్రభుత్వానికి కోర్టుల మీద కోపం ఇంకా తగ్గినట్టు లేదు. మొదట్లో కోర్టు తీర్పులను వైసీపీ నేతలు, శ్రేణులు వరుసపెట్టి విమర్శించారు. దీంతో కోర్టు సీరియస్ అయి విమర్శలు చేసిన వారికి నోటీసులు జారీ చేసింది. ఇలాంటి పోకడల వలన న్యాయ వ్యవస్థల మీద చులకన భావం ఏర్పడి నమ్మకం దెబ్బ తింటుందని కోర్టు చురకలు వేసింది. దీంతో కోర్టు తీర్పుల మీద మాట్లాడటం తగ్గించారు ప్రజా ప్రతినిధులు. కానీ తమకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పులు మాత్రం వారిలో అక్కసును పెంచుతూనే ఉన్నాయి.
తాజాగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ తిరుమలలో దైవ దర్శనానికి వచ్చి మీడియాతో కోర్టుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నీ కోర్టులే చెబుతుంటే ఇక ప్రజలెందుకు? ఎన్నికలెందుకు? ఓట్లెందుకు… ఎమ్మెల్యేలెందుకు? పార్లమెంటు సిస్టమ్ ఎందుకు? శాసనసభ ఎందుకు? శాసనసభ నాయకుడిని ఎన్నుకునేది ఎందుకు? ముఖ్యమంత్రులు ఎందుకు? స్పీకర్లు ఎందుకు? ఇవన్నీ దేనికి? మీరే (హైకోర్టు) అక్కడి నుంచి రూల్ చేస్తారా? న్యాయస్థానాల నుంచి ప్రభుత్వాలను నడిపిస్తారా? అంటూ మండిపడ్డారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల పరిధులను నిర్ణయించారు అంటూ కోర్టులకు హద్దులను గుర్తు చేశారు.
కానీ ఇన్ని మాట్లాడిన స్పీకర్ గారికి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు రాజ్యాంగబద్దంగా ఉంటే న్యాయస్థానాలు మాత్రం కలుగజేసుకుని ఏమీ చేయలేవు. ప్రభుత్వానికి తీర్పులు వ్యతిరేకంగా వస్తున్నాయి అంటే నిర్ణయాలు సరిగా లేవనే కదా అర్థం. ఇక కోర్టులు హద్దులు దాటుతున్నాయన్న స్పీకర్ మాటలకు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారమే నిదర్శనం. ఆయన కేసులో సుప్రీం కోర్టు ఒకేసారి నిర్ణయం ఇవ్వకుండా ప్రతివాదుల వాదనలకు అవకాశం ఇచ్చింది. అలాంటిది కోర్టులు పరిధిలు దాటుతున్నాయనడం చిత్రంగానే ఉంది. ఇక రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉండేవారు రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఏమిటని ప్రశ్నించిన వైకాపా నేతలు ఇప్పుడు స్పీకర్ ఇలా రాజకీయాలు, కోర్టు తీర్పులు అంటూ మాట్లాడటం మీద ఏమీ అనకపోవడం చిత్రమే మరి.