మద్యపాన నిషేదంలో మరో ముందడుగు.. ఇది జగన్ మార్క్ పాలన

 

మద్యపాన నిషేదంలో మరో ముందడుగు.. ఇది జగన్ మార్క్ పాలన

 
వైఎస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే సంపూర్ణ మద్యపాన నిషేదం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు.  దశలవారీ మద్యపాన నిషేదం పేరుతో ఒక ప్రణాళిక సిద్దం చేసుకున్న ఆయన ఆ ప్రకారమే నడుస్తోంది.  మద్యపానం తగ్గాలంటే బెల్టు షాపులను తగ్గించాలని నిర్ణయించుకున్న జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే 20 శాతం బెల్టు షాపులను రద్దు చేశారు.  దీంతో వాటి సంఖ్య 3500లకి పడిపోయింది.  తాజాగా వీటిలో కూడా ఇంకో 13 శాతం షాపులను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 
 
దీంతో షాపుల సంఖ్య 3500 నుండి 2965కి తగ్గింది. ఈ 13 శాతంతో కలిపి మొత్తం 33 శాతం బెల్టు షాపులు రద్దయ్యాయి. కొత్తగా చేసిన ఈ 13 శాతం రద్దును జిల్లాలవారీగా చేశారు.  ఈ రద్దు ఈరోజు సోమవారం నుండే అమలులోకి వస్తుంది.  దీనికి ముందు లాక్ డౌన్ నిబంధనను ఉపయోగించుకుని మద్యం ధరలను మొదట 25 శాతం, ఆ తరవాత 50 శాతం మొత్తంగా 75 శాతం పెంచేశారు.  ఈ చర్యలతో మద్యం వినియోగం పూర్తిగా కాకపోయినా కొంత తగ్గుముఖం పట్టింది.  
 
ఇకమీదట కూడా బెల్టు షాపుల సంఖ్యను దశలవారీగా తగ్గించే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందట.  ఇది మాత్రమే కాదు సరిహద్దుల ద్వారా అక్రమంగా రాష్ట్రంలోకి వస్తున్న అక్రమ మద్యాన్ని నివారించేందుకు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను ఏర్పాటు చేశారు.  ఇది స్వతంత్ర్య వ్యవస్థగా పనిచేయనుంది.  గతంలో ఎక్సైజ్‌ కమీషనర్‌ కింద  డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రొహిబిషన్‌ పోస్టు ఉండేది.  ఇప్పుడు దాని స్థానంలో స్వతంత్రంగా పనిచేసే కమీషనర్, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఉంటుంది.  ఇది డీజీపీ పర్యవేక్షలో ఉంటుంది.  దీని ద్వారా అక్రమ మద్యం, సారా లాంటి వాటిని సమర్థంగా అరికట్టే వీలుంటుంది.   ఈ రకమైన ప్లానింగ్, దాని అమలుతో త్వరలోనే జగన్ సంపూర్ణ మద్యపాన నిషేద లక్ష్యాన్ని చేరుకోనున్నారు.