కరోనా వైరస్ సృష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వ్యాప్తిని పూర్తిస్థాయిలో నిరోధించలేకపోతున్నారు. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున పరీక్షలు నిర్వహించి, వైరస్ సోకిన వారికి చికిత్స అందించడమే నివారణలో కీలకమైన ఘట్టంగా మారింది. అందుకే ప్రభుత్వాలు భారీగా పరీక్షలు చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం వెల్లడించింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలు చేయడంలో తలమునకలై ఉన్నాయి.
దేశ వ్యాప్తంగా చూస్తే ఈ పరీక్షలు నిర్వహించడంలో ఆంధ్రప్రదేశ్ చాలా చురుగ్గా ఉంది. వైరస్ తీవ్రతను మొదట్లో తక్కువగా అంచనా వేసినా ఆ తర్వాత అప్రమత్తమైన రాష్ట్ర యంత్రాంగం పనితీరును గణనీయంగా మార్చుకుంది. రోజు రోజుకూ టెస్టులు చేసే సామర్థ్యాన్ని పెంచుకుంది. మొదటి 59 రోజుల్లో లక్ష టెస్టులు చేసిన సర్కార్ ఆ తర్వాత వేగం పెంచింది. మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుని తక్కువ సమయంలో ఎక్కువ పరీక్షలు చేసే దిశగా అడుగులు వేసింది.
మొదటి లక్ష పరీక్షలకు 59 రోజులు పట్టగా తర్వాతి లక్ష పరీక్షలకు 12 రోజులు, ఆ తర్వాతి లక్షకు 11 రోజులు, ఇంకో 10 రోజుల్లో లక్ష ఇలా 82 రోజుల్లో 4 లక్షల టెస్టులు చేసి ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. 7 రోజుల్లో లక్ష, 5 రోజుల్లో లక్ష టెస్టులు చేసి ప్రస్తుతానికి నాలుగు రోజుల్లో లక్ష పరీక్షలు చేసే సామర్థ్యాన్ని అందుకుంది. మొత్తంగా ఇప్పటివరకు 10 లక్షల టెస్టులు చేసింది ఏపీ సర్కార్. దీంతో దేశంలో ఢిల్లీ తర్వాత అత్యధిక పరీక్షలు చేసిన రాష్ట్రంగా ఏపీ ఉంది. ఈ మిలియన్ టెస్టుల్లో 18697 పాజిటివ్ కేసులు రికార్డ్ కాగా ప్రజెంట్ 10043 కేసులు యాక్టివ్ దశలో ఉన్నాయి.