ఏదైనా పొలిటికల్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే తర్వాతి దఫాలో అధికారంలోకి రావడానికి ఎన్నో పనులను సమాంతరంగా చేయాల్సి ఉంటుంది. అధికార పక్షాన్ని ఎండగడుతూనే పార్టీని బలోపేతం చేసుకోవాలి. బలోపేతం చేసుకోవడంలోనే పలు కీలక బాద్యతలు దాగి ఉంటాయి. వాటిలో ప్రధానమైనది ఓటమి సమీక్షించుకోవడం. అంటే ఏయే నియోజకవర్గాల్లో కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓడాం, ఎన్ని చోట్ల భారీ తేడాతో ఓడిపోయాం అనేది పక్కాగా లెక్కలు తీసి చూసుకోవడం. ఆ లెక్కల ఆధారంగా ఏయే ప్రాంతాల్లో పార్టీ పటిష్టంగా ఉంది, ఎక్కడ బలహీనపడింది అనేది తెలిసిపోతుంది.
అలా తెలుసుకున్నాక అసలు జనం తమని ఎందుకు రిజెక్ట్ చేశారో అన్వేషించుకోవాలి. ఆ అన్వేషణలో ఎలాంటి వాస్తవాలు బయటపడినా స్వీకరించగలగాలి. అప్పుడే కొత్త నాయకులను తయారుచేసుకోవడం, మేనిఫెస్టోలో మార్పులు, శ్రేణులను బలపర్చుకోవడం, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం, జనంలోకి వెళ్ళడం, ప్రజల్లో తమను తాము గొప్పగా ప్రొజెక్ట్ చేసుకోవడం లాంటివి సాధ్యపడతాయి. ప్రతిపక్షంలో ఉండగా వైఎస్ జగన్ చేసినవన్నీ ఇవే. అవే ఆయన్ను ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాయి. సంస్థాగతంగా పటిష్టమైన నిర్మాణం కలిగిన టీడీపీకి, అపార అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడికి ఇవన్నీ అసాధ్యమైన పనులు కావు.
Read More : రానా పెళ్లిలో ధరించేవి.. మిహీక ఇచ్చిన క్లూ
కానీ చేయలేకపోతున్నారు. కారణం స్వీయరక్షణ. అవినీతి ఆరోపణలు, బలమైన కేసులు మీద పడుతుండటం, కీలక నేతల అరెస్టులతో తెలుగుదేశం సతమతమవుతోంది. ప్రభుత్వం విచారణ పేరుతో నేతల్ని రిమాండ్లో పెడుతోంది. దీంతో బాబు అండ్ కో డిఫెన్సులోనే కాలం గడపాల్సి వస్తోంది. నేతలకు, వారి కుటుంబాలకు ధైర్యం చెప్పడం, కేసుల్లో ఉన్నవారికి కోర్టు పరమైన మద్దతు ఇవ్వడం, అధికార పక్షం చర్యలను కక్షపూరిత చర్యలుగా చూపడానికే సమయాని, వనరులను వాడాల్సి వస్తోంది. దీంతో ఓటమికి గల కారణాలను వెతకడంలో, వాటిని సరిదిద్దుకోవడంలో, కొత్త నాయకులను తయారుచేసుకోవడంలో బాబు వెనుకబడ్డారు. ఫలితంగా నాయకత్వంలో బలహీనత, కార్యకర్తల్లో అయోమయం, నాయకుల్లో కేసుల భయం మాత్రమే ప్రస్తుతం టీడీపీ ముఖచిత్రంగా కనబడుతున్నాయి.