బొగ్గు కుంభకోణంలో కేంద్రమంత్రికి జైలు శిక్ష ఖరారు

కేంద్ర మాజీ మంత్రి సహా మరో ముగ్గుర్ని దోషులుగా గుర్తిస్తూ ప్రత్యేక సీబీఐ కోర్టు
శిక్షలు ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. ఇద్దరు మాజీ అధికారులు ప్రదీప్ కుమార్ బెనర్జీ, నిత్యానంద్ గౌతంలకు కూడా శిక్షలు పడ్డాయి. ఈ కేసులో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేకి ఏకంగా మూడేళ్ల జైలు శిక్ష పడింది.

ఝార్ఖండ్‌ గిరిదహ్ జిల్లా బ్రహ్మదిహ బొగ్గు గనులను నిబంధనలకు విరుద్దంగా కేటాయించినట్లు నిర్దారణ కావడంతో ఈ శిక్ష పడింది. సీబీఐ పక్కా ఆధారాలతో కేసు నమోదు చేయడంతో తప్పించుకోలేకపోయారు కేంద్రమంత్రి. 2017లో కూడా ఇలాగే బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి హరీశ్ చంద్ర గుప్తాకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. నిబంధనలను తుంగలో తొక్కి ప్రైవేటు సంస్థలకు లబ్ది చేకూర్చినందు వల్లే వీరంతా ఇలా జైలు పాలు కావాల్సి వచ్చింది. వాజ్ పేయి సర్కారు హయాంలో జరిగిన ఈ కుంభకోణం విచారణ పూర్తి చేసుకునేందుకు ఇంత కాలం పట్టింది. ఎన్డీయే తర్వాత అధికారంలోకి వచ్చిన యూపీఏ హయాంలో కూడా బొగ్గుకంభకోణం ప్రకంపణలు సృష్టించింది. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంతో పాటు బొగ్గుకుంభకోణం కారణంగా అప్పట్లో యూపీఏ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. మోడీ నేతృత్వంలోని
ఎన్డీయే కూటమి ఈ రెండు కుంభకోణాలను జనంలోకి బాగా తీసుకెళ్లడంలో సఫలమయ్యారు.