బీజేపీ శ్రేయస్సు కాంక్షిస్తున్న సాయిరెడ్డి.. టార్గెట్ టీడీపీలో భాగమా

రాష్ట్రంలో అధికారంలో ఉన్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్షం టీడీపీకి నడుమ పెద్ద యుద్దమే నడుస్తోంది.  తెలుగుదేశం నాయకులు వరుసగా కేసుల్లో ఇరుక్కుంటూ జైళ్ల పాలవుతున్నారు.  దీంతో ఇదంతా అధికార పార్టీ కక్షపూరిత చర్యేనని టీడీపీ ఆరోపిస్తోంది.  అసలు జగన్ ఉన్న ఊపులో అచ్చెన్నాయుడు, జేసీ లాంటి వారినే కాదు ఏకంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మీద కూడా నేరుగా గురి పెట్టగలరు.  కావాలంటే అందుకు సవాలక్ష కారణాలు వెతుక్కోగలరు.  కానీ ఇంకా అంత దూరం పోవట్లేదు. 
 
అందుకు కారణం భారతీయ జనతా పార్టీ.  బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అటు వైకాపా, ఇటు టీడీపీ రెండింటితోనూ రహస్య స్నేహం చేస్తోంది.  ఈ ద్వంద వైఖరి వెనుక బీజేపీ ప్రయోజనాలు బీజేపీకి ఉన్నాయి.  చంద్రబాబు సైతం ప్రజెంట్ ఉన్న విపత్కర పరిస్థితిని ఊహించే బీజేపీకి దగ్గరయ్యే పని చేశారు.  టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావులు కమలంలో చేరారు.  అందులోనూ పిరాయింపుల చట్టం వర్తించని విధంగా.  ఈ చేరిక వెనుక చంద్రబాబు సహకారం పూర్తస్థాయిలో ఉంది.  ఇలా తమ రాజ్యసభ సభ్యులను ఇచ్చి తమ బలాన్ని పెంచినందుకుగాను బీజేపీకి టీడీపీకి కొంచెం సాఫ్ట్ కార్నర్. 
 
ఒకవేళ అవసరం వస్తే టీడీపీతో భవిష్యత్తులో పొత్తు పెట్టుకోవడానికి కూడా బీజేపీ సిద్దంగానే ఉంది.  అందుకే అండగా ఉంటోంది.  ఇదే వైకాపాకు నచ్చట్లేదు.  నచ్చలేదు కదా అని బీజేపీని గట్టిగా నిలదీయలేరు.  అందుకే మంచి మాటలతో అప్పుడప్పుడు టీడీపీని దూరం పెట్టమని అంటుంటారు.  అందుకు నిదర్శనం తాజాగా విజయసాయిరెడ్డిగారు చేసిన ట్వీట్.  అందులో ఏడాది కాలంగా తినడానికి ఏమీ దొరక్క నక నక లాడుతున్న టీడీపీ మిడతల దండు కమలం పువ్వు వైపు కదులుతోంది.  ఇప్పటికే కొన్ని మిడతలు ఆపార్టీలో చేరి విధ్వంసం సృష్టిస్తున్న విషయం గ్రహించేలోగానే మిగతావి ఎగురుకుంటూ బయల్దేరాయి.  ఈ విపత్తు నుంచి బిజేపీ ఎలా బయటపడుతుందో చూడాలి అంటూ శ్రేయస్సు కోరారు.  ఈ మాటలతో బీజేపీ తెలుగుదేశం పార్టీని దూరం పెడితే వారిని మరింతగా టార్గెట్ చేయవచ్చనేది వైకాపా ప్లాన్ కావొచ్చు.