బీజేపీ తన మత పైత్యాన్ని తెలుగు ప్రజల మీద రుద్దాలనుకుంటే ఎలా
టీటీడీ పాలకమండలి శ్రీవారి ఆస్తులను అమ్మకానికి పెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఆస్తులను అమ్మే హక్కు పాలకమండలికి లేదని కొందరు, జగన్ సర్కార్ వెనక నుండి ఈ తతంగం నడిపిస్తోందని ఇంకొందరు అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఈ అసలు ప్రభుత్వానికి ఆస్తులు అమ్మే అవసరం ఏమి వచ్చింది, ఇది ఖచ్చితంగా దేవుడి ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నమే అంటూ ఆరోపణలు చేస్తోంది. మధ్య మధ్యలో భక్తుల మనోభావాలు దెబ్బతింటాయనే సెంటిమెంట్ మాటలు మాట్లాడినా హిందువులు, క్రిష్టియన్లు అంటూ మతాల జోలికిపోలేదు.
కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం టీటీడీ విషయంలో హిందూత్వం అనే భావాన్ని బలంగా ఎలివేట్ చేయాలని ప్రయత్నిస్తోంది. రాష్ట్ర భాజాపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కోట్లాది మంది హిందువులు ప్రభుత్వానికి ఎదురుతిరుగుతారని వార్నింగ్ ఇస్తుంటే మాణిక్యాలరావు, భానుప్రకాష్ రెడ్డిలు భక్తులతో కలిసి ఉద్యమం చేస్తామని అంటున్నారు. ఇలా భాజాపా ఈ విషయంలో టీడీపీ కంటే ఎక్కువగా రియాక్ట్ అవుతోంది. ఎందుకంటే ఇది దేవుడికి సంబంధించిన ఇష్యూ, అంతర్గతంగా మతం, హిందూత్వం అనే అంశాలు కూడా ఉన్నాయి.
అందుకే బీజేపీకి ఈ ఇష్యూ మీద ఇంత ఆసక్తి. దేశంలో భాజాపా ఇంత పెద్ద శక్తిగా ఎదిగింది అంటే దాని వెనక వారు భుజానికెత్తుకున్న హిందూత్వం అనే ఆయుధం ఉంది. హిందూ మత పునాదులపై నిలబడిన భాజాపా మొదటి నుండి దక్షిణాదిన నిలదొక్కుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నీ మతపరమైన ప్రయత్నాలే తప్ప రాజకీయ ప్రయత్నాలు తక్కువ. ఆ ప్రయత్నాలు కూడా అంతగా వర్కవుట్ కాలేదు. అయినా భాజాపా వాటిని వదలడం లేదు.
సందు దొరికితే హిందూత్వ జెండాను పట్టుకుని నానా యాగీ చేసే కషాయ దళానికి ఏపీలో టీటీడీ ఆస్తుల విక్రయం అంశం బాగా దొరికింది. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోదలుచుకోవడం లేదు వారు. అందుకే హిందూ ఉద్యమం, భక్తుల మనోభావాలు అంటూ మాట్లాడుతున్నారు. తెలంగాణ భాజాపా నేత బండి సంజయ్ అయితే వైఎస్ జగన్ టీటీడీ ఆస్తులను అమ్మేసి పాస్టర్లకు జీతాలు ఇవ్వాలనుకుంటున్నారు అంటూ మాట్లాడేశారు. అసలు ప్రభుత్వ పాలనా పరమైన అంశాల్లో ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని రాజకీయంగానే చూడాలి, అలానే డీల్ చేయాలి తప్ప దేవుడు, దేవస్థానం అంశాలైనంత మాత్రాన దానికి మతం రంగు పులమాల్సిన అవసరం లేదు.
ఇప్పటికే ఏపీ కుల, వర్గ పరమైన రాజకీయాలతో నానా తంటాలు పడుతోంది. వీటి పుణ్యమా అని పలు ప్రాంతాల్లో గొడవలు, అంతర్గత కలహాలు రేగి అభివృద్ది కుంటుబడింది. ఇవి చాలవన్నట్టు భాజాపా మతపరమైన రాజకీయాలకు కూడా తెర తీస్తే ఆ విధ్వంసం మరీ నష్టపూరితంగా ఉంటుంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అన్యాయమని బీజేపీకి అనిపిస్తే న్యాయవ్యవస్థ ఒకటి ఉంది. జయాపజయాలను అక్కడే తేల్చుకోవచ్చు. అంతేకానీ ప్రతిదానికీ మతం రంగు పులిమేసి ప్రయోజనం పొందాలనుకుంటే మాత్రం సరైన పద్దతి కాదు. ఈ వాస్తవాన్ని ఒక్క భాజాపా మాత్రమే కాదు మత రాజకీయాలను చేయాలనుకునే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి.
