ప్రైవేట్ కరోనా టెస్టుల వలన పెను ప్రమాదమే ఉండొచ్చు

 

ప్రైవేట్ కరోనా టెస్టుల వలన పెను ప్రమాదమే ఉండొచ్చు

 
కరోనా టెస్టులను ప్రభుత్వాలు మాత్రమే చేయాలనే నిబంధనను ఎత్తివేసే దిశగా చర్యలు జరుగుతున్నాయి.  సామర్థ్యం ఉన్న ప్రైవేట్ ల్యాబ్స్, ఆసుపత్రులు పరీక్షలు చేయవచ్చని తెలంగాణ హైకోర్టు సైతం ఉత్తర్వులిచ్చింది.  మొదటి నుండి ధనిక వర్గాలు ప్రభుత్వాలు మాత్రమే టెస్టులు చేస్తే ఎలా ప్రైవేట్ వారికి అనుమతులు ఇస్తే ఖర్చు పెట్టగలిగిన మాలాంటివారు చేయించుకుంటారు కదా అప్పుడు టెస్టుల సంఖ్య కూడా పెరుగుతుంది అంటూ వాదిస్తూ వచ్చారు.  
 
పాజిటివ్ వచ్చినవారు బయటికి చెబుతారా:
 
వారి వాదన మేరకే టెస్టులను ప్రైవేట్ ల్యాబ్స్ చేతికి అప్పగిస్తే టెస్టుల సంఖ్య పెరగొచ్చేమో కానీ పెను ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.  అదేమిటంటే ఇప్పటికే కరోనా సోకినవారు తమ వివరాలను బయటపెట్టడానికి ముందుకు రావట్లేదు.  కొందరైతే తప్పించుకు తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.  ఏదో రాష్ట్ర ప్రభుత్వాల సమక్షంలో టెస్టులు జరుగుతున్నాయి కాబట్టి పాజిటివ్ వచ్చిన వారిని బలవంతంగా అయినా క్వారంటైన్ చేయగలుగుతున్నారు.  ఇక పాజిటివ్ వచ్చిన వారి కుటుంబ సభ్యులను, కాంటాక్టులను వెతికి పట్టుకుని మరీ క్వారంటైన్లో పెడుతున్నారు.  ఈ ప్రాసెస్ చాలా కష్టంతో కూడుకున్నది. 
 
ఒకవేళ కరొనా టెస్టులు ప్రైవేట్ వ్యక్తులే గనక చేస్తే  పాజిటివ్ వచ్చిన వ్యక్తులు తమకు వైరస్ ఉందనే విషయాన్ని బయటకు చెబుతారా.. లేదు.  నేరుగా ఇంటికి వెళతారు.  ఇంట్లో వారికి వైరస్ అంటిస్తారు, బయట తిరుగుతూ సమాజంలో వైరస్ వ్యాప్తికి కారకులవుతారు.  వీరు కాకపోతే టెస్టులు చేసిన ప్రైవేట్ ల్యాబ్స్ తాము టెస్ట్ చేసిన పాజిటివ్ రోగుల వివరాలను ఉన్నది ఉన్నట్టుగా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చెబుతాయా అంటే అదీ గ్యారెంటీ లేని విషయమే.  
 
ప్రభుత్వాలు సామర్థ్యం పెంచుకోవడమే మార్గం: 
 
సో.. టెస్టుల విషయంలో ప్రభుత్వాల ఇన్వాల్మెంట్ లేకపోతే పాజిటివ్ కేసులను కట్టడి చేసి వారి కాంటాక్టులను వెతికి పట్టుకోవడం సరిగా జరగదు.  అదే టేస్టులు ప్రభుత్వాలే చేస్తే లక్షణాలు ఉన్న ఎవరైనా ప్రభుత్వ ఆసుపత్రులకే రావాలి.  అప్పుడు పాజిటివ్ కేసుల కట్టడి సాధ్యమవుతుంది.  కాబట్టి ప్రభుత్వాలు వీలైనంత త్వరగా టెస్టులు చేసే సామర్థ్యాన్ని పంచుకుంటే ప్రైవేట్ ల్యాబ్స్ అవసరం తగ్గుతుంది.