ప్రైవసీ పాలసీపై వెనక్కి తగ్గిన వాట్సాప్ !

వివాదాస్పద ప్రైవసీ పాలసీపై మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెనక్కి తగ్గింది. ఇటీవల తీసుకొచ్చిన ఈ పాలసీపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తం కావడం, ఈ నేపథ్యంలో ప్రత్యర్థి యాప్‌లు సిగ్నల్, టెలిగ్రామ్‌లకు ఆదరణ పెరుగుతుండడంతో వెనక్కి తగ్గిన వాట్సాప్.. ప్రైవసీ పాలసీ ఆప్‌డేట్‌ను మూడు నెలలపాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

whatsapp postponed its privacy policy for three months

నిజానికి వచ్చే నెల 8 నుంచే ఈ కొత్త విధానం అమల్లోకి రావాల్సి ఉండగా, తాజా నిర్ణయంతో ఇది మూడు నెలల వెనక్కి జరిగింది. కొత్త పాలసీపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ఈ మూడు నెలలను ఉపయోగించుకుంటామని, అప్పటి వరకు ఏ ఒక్కరి ఖాతాను రద్దు చేయబోమని స్పష్టం చేసింది. కొత్త విధానాన్ని ఖాతాదారులు అర్థం చేసుకున్న తర్వాతే దానిని అమల్లోకి తీసుకొస్తామని వివరించింది. అప్‌డేట్ పాలసీపై ప్రజల్లోకి తప్పుడు సమాచారం వెళ్లడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

వాట్సాప్ ప్రైవసీ పాలసీలో భాగంగా ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం, ఐపీ అడ్రస్‌లను ఫేస్‌బుక్‌‌తో పంచుకుంటామని, ఇందుకు అంగీకరిస్తేనే ఖాతా కొనసాగుతుందని, లేదంటే డిలీట్ అయిపోతుందంటూ ఇటీవల వినియోగదారులందరికీ పాపప్ మెసేజ్‌లు పంపింది. ఈ పాలసీపై సర్వత్ర విమర్శలు వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గిన వాట్సాప్ కేవలం బిజినెస్ ఖాతాలకు సంబంధించిన వివరాలను మాత్రమే పంచుకుంటామని వివరణ ఇచ్చింది. అయినప్పటికీ విమర్శలు తగ్గకపోవడంతో ఈ విధానాన్ని మూడు నెలలపాటు వాయిదా వేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.