పవ‌న్‌ను విమర్శించాలంటే వైకాపాకు చంద్రబాబే దిక్కా 

కాపుల సంక్షేమం కోసం రూ. 4,770 కోట్లు వెచ్చించామని అధికార పక్షం చెప్పడంతో పవన్ అవన్నీ కాకి లెక్కలని, రాష్ట్ర ప్రజలందరికీ ఇచ్చిన పథకాలలోనే కాపులకు ఇచ్చిన నిధులను వేరు చేసి చూపుతున్నారని విమర్శించారు.  ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ కాపుల కోసం ప్రత్యేకంగా ఏటా రూ.2000 కోట్లు కేటాయిస్తామని అన్నారు.  వాటిలో ఎంత నిధులు ఇచ్చారో చెప్పలని, అసలు కాపు కార్పొరేషన్ కు బడ్జెట్లో ఎంత కేటాయించారు, కాపు నేస్తం పథకం కింద కేవలం 2.35 లక్షల మంది కాపులనే లబ్దిదారులుగా గుర్తించడంలో పలు సందేహాలున్నాయని ప్రశ్నలు లెవనెత్తారు. 
 
దీంతో అధికార పార్టీ ఎప్పటిలాగే పవ‌న్‌ను చంద్రబాబు మనిషిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.  ప్రతిసారీ పవన్ ఏ విషయం మాట్లాడినా వైకాపా డిఫెన్స్ ఈ తరహాలోనే ఉంటోంది.  చంద్రబాబు హయాంలో జరిగిన అన్యాయాలను ప్రశ్నించలేదు కానీ మమ్మల్ని లెక్కలు అడుగుతారా అంటూ వైసీపీ నేతలు విరుచుకుపడుతుంటారు.  ఇప్పుడు కూడా మంత్రి కురసాల కన్నబాబు పవన్ కాపు నేస్తం పథకం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కాపులకు అన్యాయం చేసిన చంద్రబాబును ఎందుకు నిలదీయలేదని అన్నారు.  పవన్ తన స్టేట్మెంట్లో టీడీపీ కాపులకు మేలు చేసిందని అనలేదు.  అయినా పవన్ బాబును వెనకేసుకొస్తున్నట్టు మాట్లాడారు కన్నబాబు.  అంతేనా కుల ప్రస్తావన లేకుండా రాజకీయం చేయలేరని అంటూ ముద్రగడ ఉద్యమాన్ని చంద్రబాబు అణిచివేస్తే పవన్ ఏం చేస్తున్నారని సంబంధం లేని అంశాన్ని తెరపైకి తెచ్చారు. 
 
అంతేకానీ బడ్జెట్లో కాపు కార్పొరేషన్ కోసం ఎంత కేటాయించారు, హామీ సొమ్ము యేడాదికి 2000 కోట్లలో ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారు, నవరత్నాలను కలిపి రూ.4,770 కోట్లు కాపులకు ఖర్చు చేశామని ఎలా చెబుతారు, ఇతర పథకాలను కాపు కార్పొరేషన్ నిధుల కింద ఎలా క్కన్వర్ట్ చేసి చెబుతారు అనే సూటి ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు.  కానీ ఎప్పటిలాగే పవ‌న్‌కే చంద్రబాబు మనిషిగా ప్రొజెక్ట్ చేసే పని మాత్రం చేశారు.  దీన్నిబట్టి వైకాపా నేతలు ఇప్పటికీ పవ‌న్‌కే విమర్శించాలంటే చంద్రబాబుతో లింక్ పెట్టి మాట్లాడటం మినహా ఇంకో దారి కనుక్కోలేకపోయారని మరోసారి రుజువైంది.