ప్రజెంట్ ఏపీలో చర్చల్లో ఉన్న అంశం కాపు రిజర్వేషన్లు. కాపులకి రూ.4770 కోట్లతో మేలు చేశామని అధికార పార్టీ ప్రకటన చేయగానే జనసేన నుండి ప్రశ్నల వర్షం మొదలైంది. దీంతో జనసేన నేతలకు, వైకాపా నేతలకు హోరాహోరీ మాటల యుద్దం నడుస్తోంది. ఈ తరుణంలో కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. నేరుగా సీఎం వైఎస్ జగన్కు లేఖ రాశారు. తమ జాతి డిమాండ్ తీర్చాలని ప్రధానికి లేఖ రాయాలని వైఎస్ జగన్కు కోరారు. గత ఎన్నికల్లో చాలా చోట్ల వైకాపా విజయం వెనుక కాపుల మద్దతు ఉందని గుర్తు చేశారు.
హమీలు ఇవ్వని వారికీ, అడగని వారికీ, హామీలు ఇచ్చిన వారికి, ఇవ్వని వారికి దానకర్ణుడిలా దానాలు చేస్తున్న ముఖ్యమంత్రికి కాపు రిజర్వేషన్ సాధించడంలో ఎందుకు చేతులు రావడం లేదని ప్రశ్నించారు. ఎన్నికలకి ముందు చంద్రబాబు తమను అణచివేసిన తీరును మీ టీవీ ఛానెల్ నందు పదే పదే గుర్తుచేసి సానుభూతి ఓట్లు పొందారు, ఒకానొక సంధర్భంలో మా డిమాండ్ సమంజసమైనదే అన్నారు, కానీ ఇప్పుడు మా జాతి కోరిక తీర్చడంలో ఇంత ఆలసత్వం ఎందుకని ప్రశ్నించారు.
Read More : సీఎం కేసీఆర్ ఇంట్లో కరోనా
పాలకులు ప్రజల యొక్క కష్టాలలో పాలు పంచుకోవాలి. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు, అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు గారు, అప్పటి ముఖ్యమంత్రి మీ తండ్రి రాజశేఖర రెడ్డిలా పూజలందుకోవాలే గాని పదవి మూన్నాళ్ళ ముచ్చటగా చేసుకోకండి. ముఖ్యమంత్రి గారు దయచేసి మాజాతి సమస్య తీర్చమని భారత ప్రధాని గౌరవ మోదీ గారిని కోరమని మిమ్మలను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అంటూ హెచ్చరికతో కూడిన విఙ్ఞప్తి చేశారు. మరి పవన్ ప్రశ్నలకు కాపులకి ఎంతో మేలు చేశామని బల్లగుద్ది చెబుతున్న వైకాపా నేతలు ముద్రగడకు కూడా అలాంటి సమాధానమే ఇస్తారేంమో చూడాలి.