నోరెత్తలేని రీజన్ చెప్పిన కేసీఆర్

కరోనా లాక్ డౌన్ కారణంగా అన్ని పరిశ్రమలు మూతబడటంతో తెలంగాణ రాష్ట్ర ఆదాయం పూర్తిగా స్తబించిన మాట వాస్తవం.  ఫలితంగా భారం ప్రభుత్వ ఉద్యోగుల మీద పడింది.  ప్రభుత్వ శాఖల్లోని కొన్ని శాఖలకు మినహా మిగతా అన్ని శాఖల వారికి జీతాల్లో కోత విధించారు.  మొదటి రెండు నెలలు ఎలాగో ఇబ్బంది పడిన ఉద్యోగులు మూడో నెల కూడా జీతాల్లో కోత అనేసరికి తట్టుకోలేకపోయారు.  పూర్తి జీతం కోసం డిమాండ్ చేశారు.  ఉద్యోగ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ సర్కార్ మీద విమర్శలకు దిగారు.  కేసీఆర్ ఊదరగొడుతున్నట్టు తెలంగాణ ధనిక రాష్ట్రం కాదనే వాదన తెరపైకి వచ్చింది. 
 
 
మరోవైపు పెన్షన్లలో కూడా కోత పెట్టడం, రాత్రికి రాత్రి ఆర్డినెన్స్ తేవడంతో ఈ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి.  తెలంగాణ మిగులు రాష్ట్రం అయితే ప్రజలకి ఈ తిప్పలేమిటని జనం సైతం అన్నారు.  కోర్టు కూడా పెన్షన్లలో కోత పై వివరణ అడిగింది.  వీటిపై ఇన్నిరోజులు పెద్దగా స్పందించని కేసీఆర్ తాజాగా స్పందించారు.  తాను చెబుతున్నట్టు తెలంగాణ నూటికి నూరు శాతం ధనిక రాష్ట్రమేనని అన్నారు.  రైతుబంధు పథకం కోసమే ఉద్యోగులకు జీతాలు ఆపామని సీఎం కేసీఆర్‌ చెప్పారు.  రైతుల దగ్గర డబ్బులు ఉంటే సమాజం దగ్గర ఉన్నట్టేనని, ప్రభుత్వం తీసుకున్న చర్యలతో తెలంగాణ రైతుల్లో ధైర్యం వచ్చిందని అన్నారు. 
 
 
లాక్ డౌన్ సడలింపు వలన తిరిగి రాష్ట్ర ఆదాయం పెరిగిందని, పల్లెలన్నీ పచ్చగా మారుతున్నాయని, పట్టణాల నుంచి సొంతూళ్లకు వలసలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా గ్రామాలకు నిధులు ఇస్తున్నామని కేసీఆర్ అన్నారు.  ఇలా ఉద్యోగుల జీతాల్లో కోత రైతుల కోసమేనని కేసీఆర్ అనడంతో ఆ నిధులన్నీ ఏం చేశారనే ప్రశ్నలకి శాశ్వత సమాధానం ఇచ్చేసినట్టే అయింది.  పైగా రైతు బంధు పథకం పకడ్బందీగా అమలవుతుండటంతో కేసీఆర్ మాటల్ని కొట్టి పారేయలేని పరిస్థితి.  మొత్తం మీద కేసీఆర్ రైతుల సంక్షేమాన్ని తెర మీదకు తెచ్చి అన్ని విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేయడం ఆయన రాజకీయ చతురతకు నిదర్శనం.