ఇప్పటికే సరిహద్దుల్లో చైనా, పాక్ దేశాలతో భారత్ పోరాడుతోంది. ఆ రెండు దేశాల సైనికులు తరచూ ఒప్పందాలను ఉల్లంఘించి భారత జవాన్లపై దాడులకు దిగుతున్నారు. కొన్నిరోజుల క్రితమే లధాఖ్ సరిహద్దులో సైన్యం జరిపిన దాడిలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ ఘటనతో దేశం యావత్తు ఉడికిపోయింది. రక్షణ రంగం మొత్తం ఇండియా, చైనా సరిహద్దుల మీదే పూర్తి నిఘాను పెట్టింది. ఈ పరిస్థితినే ఈ ఉగ్రవాదులు అవకాశంగా మలుచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. సరిహద్దు ఉద్రిక్తతల నడుమ సైన్యం కళ్లుగప్పి దేశ రాజధాని ఢిల్లీలోకి చొరబడేందుకు ఉగ్రమూకలు పనిచేస్తున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.
దీంతో రాజధానిలో హైఅలర్ట్ విధించారు. నిఘా వర్గాల సమాచారం మేరకు కాశ్మీర్ నుండి నలుగురైదుగురు ఉగ్రవాదులు ఒక ట్రక్ ద్వారా ఢిల్లీలోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు అనుమానిత ప్రదేశాల్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఢిల్లీలోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, గెస్ట్‌హౌస్‌లు, ఇతర ప్రదేశాల్లో భద్రతాచర్యలు చేపట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి దేశ రాజధానికి వచ్చే అన్ని మార్గాల సరిహద్దుల్లో వాహన తనీఖీలు చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజదానిలో ఉగ్ర దాడులకు అస్కారం ఇవ్వకూడదని పనిచేస్తున్నారు.
ఇక తాజాగా శ్రీనగర్ కుల్గామ్ జిల్లాలో భారత సైన్యం హిజ్బుల్ ముజాహుద్దీన్, ఐసిస్ సంస్థలకు చెందిన నలుగురు ఉగ్రవాదులను హతమార్చగా, తాజాగా రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్‌లో పాక్ సైన్యం కాల్పుల ఒప్పందాన్ని మీరి కాల్పులు జరపడంతో ఒక జవాను వీరమరణం పొందారు. అనంతనాగ్ కాప్రాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్యన కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఒక్క నెలలోనే పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో భారత జవాన్లు నలుగురు అమరులయ్యారు. మొత్తం మీద సరిహద్దుల వద్ద పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగానే ఉన్నాయి.