వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ పదవిలో కూర్చున్నప్పటి నుండి ఏదో ఒక వివాదంతో దేవస్థానం నిత్యం వార్తల్లో ఉంటూనే ఉంది. ఈ వివాదాల్లో కొన్ని టీటీడీ తీసుకోదలచిన శ్రీవారి ఆస్తుల విక్రయం లాంటి పొరపాటు నిర్ణయాల వలన వస్తే ఇంకొన్ని మాత్రం కుట్రపూరితంగా వస్తున్నవే. వాటిలో ముఖ్యంగా తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందనే పుకార్లు. ఇప్పటికే టీటీడీలో ఇతర మతస్థులను పెద్ద ఎత్తున నియమించడం జరిగిందనే ఆరోపణలు తలెత్తగా వారిని వేరే శాఖలకు బదిలీ చేయడం జరిగింది.
ఇక టీటీడీ అనుబంధ ఛానెల్ ఎస్వీబీసీ చైర్మన్ పదవిలో ఉన్న నటుడు పృధ్వీరాజ్ విషయంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరికి ఆయన పదవి నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక తాజాగా టీటీడీ మాసపత్రిక సప్తగిరితో పాటు సజీవసువార్త అనే మరొక పత్రిక చందాదారునికి చేరడం పెద్ద వివాదమైంది. ప్రభుత్వం కావాలనే అన్యమత ప్రచారానికి సహకరిస్తోందని వేరొక రాజకీయ పార్టీ మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు లేచాయి. టీటీడీ పాలకమండలి వ్యవహారశైలి మీదే అనుమానం వచ్చేలా కథనాలు పరచురితమయ్యాయి.
సాధారణంగా టీటీడీ మాసపత్రికను బాగా దైవభక్తి ఉన్నవారే వేయించుకుంటుంటారు. అలాంటి వారి వద్ద ఇలాంటి అన్యమత ప్రచారమనే వివాదం రేగితే పెద్ద దుమారమే అవుతుంది. అయింది కూడ. ఇలాంటి సున్నితమైన వివాదాలను తెలివిగా డీల్ చేయాలి. ఎన్నిసార్లు ఇది ప్రత్యర్థుల కుట్రని చెప్పి బయటపడటానికి వీలులేదు. ఆధారాలతో సహా రుజువు చేయాలి. సప్తగిరి మాసపత్రికలో వేరొక మత పత్రికను వచ్చేలా చేయడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. కవర్ సీల్ ఓపెన్ చేస్తే అందులో వేరే ఏ వస్తువైనా పెట్టవచ్చు. టీటీడీ నుండి పత్రిక బయటికి వచ్చాక భక్తునికి చేరే వరకు మధ్యలో ఎక్కడైనా ఈ పని చేయవచ్చు. కాబట్టి కేవలం కొట్టి పారేయడం కాకుండా గట్టి విచారణ చేపట్టి అసలు కారకులెవరో పట్టుకోవాలి, భక్తుల ముందు నిలాబెట్టాలి. అప్పుడే టీటీడీ పాలకమండలి మీద మరకలు పడకుండా ఉంటాయి. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి కుట్రలు, ఆరోపణలు ఇంకా చాలా జరుగుతాయి.