టిక్ టాక్ సహా 59 చైనా యాప్‌లపై భారత్ నిషేధం 

చైనాకు చెందిన 59 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది.  వీటిలో మోస్ట్ పాపులర్ యాప్ టిక్ టాక్ సహా బాగా ప్రాచుర్యం పొందిన యూసీ బ్రౌజర్, క్లబ్ ఫ్యాక్టరీ, షేర్ ఇట్, విగో వీడియో, బ్యూటీ ప్లస్, వైరస్ క్లీనర్ లాంటి మొత్తం 59 యాప్స్ ఉన్నాయి.  14 రోజుల క్రితం లధాఖ్ గల్వాన్ లోయలో చైనా సైన్యం జరిపిన దాడిలో భారత సైనికులు 20 మంది వీర మరణం పొందిన సంగతి తెలిసిందే.  ఈ ఘటనతో చైనా పట్ల భారత ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు రగిలాయి.  చైనా మీద కూడా పాక్ మీద జరిపినట్టు దాడులు చేయాలన్న డిమాండ్ ప్రజల నుండి వచ్చింది.  
 
ఇక ఏదో రకంగా చైనా తోక కత్తిరించాలని, అందుకు గాను చైనా ఉత్పత్తుల మీద తక్షణ నిషేధం పెట్టాలని కూడా అన్నారు.  కొందరు ప్రజలు, రాజకీయ పార్టీలు స్వచ్చంధంగా చైనా ఉత్పత్తులను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.  ఈ ఉద్రిక్తతల నడుమ తాజాగా కేంద్రం చైనాకు చెందిన 59 యాప్‌లను బ్యాన్ చేసింది.  నిజానికి చైనా యాప్స్ మూలంగా భారతీయుల సమాచారానికి ముప్పు ఉందని, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, నిబంధనలు పెట్టినా మన ప్రజల  గోప్యతకు చైనా వలన ముప్పు వాటిల్లుతోందని భారత సాంకేతిక నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  
 
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ బ్యాన్ విధించింది.  ప్రైవసీ సమస్య ఒకటైతే టిక్ టాక్ లాంటి యాప్ ద్వారా విశృంఖలత ఎక్కువైందని, ప్రమాదాలు జరుగుతున్నాయని పలు రాష్ట్రాలు ఆరోపణలు చేస్తూ దాన్ని బ్యాన్ చేయగా ఇప్పుడు మొత్తంగా బ్యాన్ చేశారు.  బ్యాన్ చేయబడిన ఈ యాప్స్ అన్నిటికీ భారత్ నుండి పెద్ద మొత్తంలో ఆదాయం ఆర్జిస్తోంది చైనా.  ఇప్పుడు ఈ బ్యాన్ కారణంగా ఆ ఆదాయం మొత్తానికి గండి పడ్డట్టే.  ప్రభుత్వం తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం పట్ల దేశ ప్రజల నుండి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమవుతోంది.