జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిలతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. పోలీసుల విచారణలో భాగంగా బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా మార్చేందుకు నకిలీ పత్రాలు సృష్టించి అమ్మినట్లు తేలింది. ఈ క్రమంలో దాదాపు 154 వాహనాలకు నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లు సమర్పించినట్లు పోలీసు అధికారుల విచారణలో తేలింది.
ఇక తాజాగా సంచలన మ్యాటర్ ఏంటంటే.. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన అనుచరుడు చవ్వా గోపాల్ రెడ్డి పోలీసుల విచారణలో కొన్ని కీలక విషయాలు వెళ్ళడించారని వార్తలు వస్తున్నాయి. అరెస్ట్ అనంతరం పోలీసుల కస్టడీలో ఉన్న వీరు తాజాగా చెప్పిన వివరాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అసలు ఏం జరిగిందంటే.. పలు స్క్రాప్ వాహనాల రిజిస్ట్రేషన్ కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి చెన్నైకి చెందిన ముత్తుకుమార్‌ను సంప్రదించినట్టు వారు తెలిపారు. అనంతరం నాగాలాండ్ రావాణా శాఖ (ఆర్టీఏ) బ్రోకర్ సంజయ్ ద్వారా జేసీ ప్రభాకర్ రెడ్డి అండ్ బ్యాచ్ పలు వాహనాలకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించారని తేలింది.
మొత్తం 154 వాహనాలను నాగాలాండ్‌కు తీసుకెళ్లకుండానే రిజిస్ట్రేషన్ చేయించారని తెలిపారు. ఇలా బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా నమోదు చేయించేందుకు.. భారీగా డబ్బులు చెల్లించారని సమాచారం. ఇక ఆ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు నాగేంద్ర నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లు తయారు చేసి, ఎన్‌ఓసీ తీసకున్నారని జేసీ తెలిపినట్లు సమాచారం. ఇక ఫోర్జరీ చేసిన పత్రాలతోనే ఇతర రాష్ట్రాల్లో వోల్వో బస్సులు, లారీలు విక్రయించారు. అంతే కాకుండా మొత్తం అశోక్ లేలాండ్‌కు చెందిన వాహనాలను స్క్రాప్ కింద కొనుగోలు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి అండ్ టీమ్, ఆ తర్వాత వాటిని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేసి మార్చిన తీరు ఇప్పుడు సంచనంగా మారింది. అయితే తాజాగా పోలీసుల విచారణలో భాగంగా జేసీ ప్రభాకర్ నేరం అంగీకరించారని వార్తలు వస్తున్నాయి.