కొత్త జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రంగం సిద్దం చేసారు. బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో జిల్లాల ఏర్పాటుకు కమిటీ ఏర్పాటు చేసారు. సీసీఎల్ ఏ కమీషనర్, జీఏడీ సర్వీసుల సెక్రటరీ, ప్లానింగ్ విభాగం సెక్రటరీ, సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి, కన్వీనర్ గా పైనాన్స్ ప్రిన్స్ పల్ సెక్రటరీ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం రాష్ర్టంలో ఉన్న 13 జిల్లాల్ని 26 జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నారు. ఇక అరకు భౌగోళికంగా పెద్దది కావడంతో ఆ ప్రాంతాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేసే విషయంపై అధికారులు అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు.
ఎట్టి పరిస్థితులో మార్చికల్లా ఈప్రక్రియ మొత్తం పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. అయితే శ్రీకాకుళం జిల్లాను విభజించొద్దని ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఆ జిల్లాని విభజిస్తే రాజకీయంగా దెబ్బతింటామని, విభజనతో అభివృద్ది చెందిన ప్రాంతాలన్ని విజయనగరం జిల్లాలో కలిసిపోతాయని సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వం తనని అర్ధం చేసుకుంటుందని….శ్రీకాకుళం జిల్లాకి మాత్రం మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో ధర్మానని ప్రభుత్వం లైట్ తీసుకోవడానికి లేదని..ఆయన్ని కూల్ చేసే ప్రయత్నం లో భాగంగా ఉత్తరాజంధ్ర జిల్లాల బాధ్యత ఆయనకే అప్పగించే అవకాశం ఉందని ప్రచారం సాగింది.
అయితే సీఎం జగన్ మాత్రం పూర్తిగా ప్రభుత్వ అధికారుల ద్వారానే జిల్లాల ఏర్పాటుకు సిద్దమయ్యారు. కాబట్టి జిల్లాల ఏర్పాటు అనేది పూర్తిగా కమిటీ సభ్యుల చేతుల్లోనే ఉంటుంది. ప్రాంతాల పరంగా, రాజకీయ పరంగా ఫిర్యాదులు ఏమైనా ఉంటే నేతలు కేవలం కమిటీ దృష్టికి తీసుకెళ్లడం వరకే పరమితం. తుదిగా నిర్ణయం తీసుకునేది కమిటీ, సీఎం మాత్రమేనని తెలుస్తోంది. మంత్రి వర్గ సమావేశంలో కూడా ధర్మాన ప్రపోజల్ వచ్చినట్లు లేదు. అలాగే శ్రీకాకుళం జిల్లా గురించి జగన్ మీడియా సమావేశంలో స్పందించింది కూడా లేదు. ఈ నేపథ్యంలో ధర్మాన ఎలా ముందుకు వెళ్తారు? జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తారా? విబేధించి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారా? అన్నది చూడాలి.