జగన్ రాయలసీమ ఎత్తిపోతల కల చెదిరినట్టే

శ్రీశైలం కుడి కాలవకు రోజుకు మూడు టీఎంసీల నీటిని తీసుకెళ్ళడానికి ఏపీ నిర్మించదలచిన కొత్త ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణతో వాడీ వేడి వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే.  వైఎస్ జగన్ కేసీఆర్ నోటీసుకు వెళ్లకుండానే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికీ జీవో నెం 203ను విడుదలచేశారు.  దీంతో కేసీఆర్ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరుతామని అన్నారు.  దీంతో ఇరు రాష్ట్రాల నడుమ జల వివాదం రాజుకుంది.  టీఆర్ఎస్ సహా బీజేపీ కూడా ప్రాజెక్ట్ కట్టడానికి వీల్లేదని కేంద్ర జలవనరుల శాఖ నుండి ఉత్తర్వులు తెచ్చింది.  పిఎంవో సైతం పిర్యాధును క్రిష్ణా రివర్ యాజమాన్య బోర్డుకు పంపింది. 

తెలంగాణ ప్రభుత్వం కూడా అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ కట్టడం చట్టవిరుద్దమని కేఆర్ఎంబీకి పిర్యాధు చేసింది.  ఏపీ ప్రభుత్వం కూడా కృష్ణా జలాల్లో తమకున్న వాటాను మాత్రమే వాడుకుంటామని, ఇందులో ఎవరికీ అన్యాయం జరగదని, ఎవరు అడ్డు చెప్పినా ఆగేది లేదని అంటూ పరిపాలనా అనుమతులు ఇచ్చింది.  దీంతో ఈ అంశం రాజకీయంగా వేడిని రాజేసింది.  కేసీఆర్ నేరుగా జగన్ మీద విమర్శలు చేయకుండానే అన్యాయమైతే అడ్డుకుంటామని హెచ్చరించారు.  ఇక కేసీఆర్, జగన్ మధ్య ఉన్న స్నేహాన్ని చూపుతూ తెరాస ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు. 
 
దీంతో తెలంగాణ సర్కార్ కేఆర్ఎంబీ ముందు ప్రాజెక్ట్ అక్రమమని బలమైన వాదనలు వినిపించింది.  కానీ ప్రాజెక్ట్ కట్టి తీరుతామన్న ఆంధ్రా సర్కార్ మాత్రం కేఆర్ఎంబీని ఒప్పించటంలో విఫలమైంది.  ఫలితంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరిట ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుకు పరిపాలనాపరమైన అనుమతినివ్వడం చట్టాన్ని ఉల్లంఘించినట్టేనని కృష్ణా నది యాజమాన్య బోర్డు తెలిపింది.  అపెక్స్‌ కౌన్సిల్‌ నుంచి అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టు చేపట్టడం రాష్ట్ర విభజన చట్టం మేరకు చట్టవిరుద్దమని తేల్చింది.  దీంతో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ కట్టాలన్న జగన్ కల చెదిరినట్టైంది.