జగన్ బొమ్మలు తీసేది లేదట.. మళ్లీ కేసులు, కోర్టులు తప్పవా 

పంచాయతీ కార్యాలయాలపై వేసిన మూడు రంగులను తీసివేయాలని కోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే.  మొదటిసారి వచ్చిన తీర్పులో లొసుగులు వెతుకుతూ పార్టీ రంగులకు కొత్తగా నాలుగో రంగు యాడ్ చేయాలని చూసిన ప్రభుత్వానికి కోర్టు నుండి గట్టి ఎదురుదెబ్బ తగిలడంతో వెనక్కి తగ్గింది.  న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు పంచాయతీ కార్యాలయాలకు రంగులను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.  అలాగే సీఎం జగన్ బొమ్మను మాత్రం తొలగించవద్దని కూడా గట్టిగా చెప్పిందట.  దీంతో కొత్త వివాదం తెరపైకి వస్తోంది. 
 
 
ప్రభుత్వ కార్యాలయాలపై శాశ్వతంగా ముఖ్యమంత్రి బొమ్మ ఉండటం అనేది ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు.  ఏదైనా కార్యక్రమం సమయంలో ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఫ్లెక్సీలలో మాత్రమే సీఎం బొమ్మలు ఉండేవి.  అది కూడా ఒకటి రెండు రోజులు మాత్రమే.  కానీ ఏపీ సీఎం వైఎస్ జగన్ మాత్రం ఐదేళ్లు శాశ్వతంగా ప్రభుత్వ భవనాల మీద తన బొమ్మ ఉండాల్సిందేనని కోరుకుంటున్నారు.  సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ మేరకు అది సరైనది కాదని కొందరు సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. 
 
 
రంగుల విషయంలో ఈ బొమ్మల అంశం పెద్దగా చర్చకు రాలేదు.  ప్రభుత్వానికి, కోర్టుకు నడుమ రంగుల విషయం మీదే ఎక్కువగా వాదోపవాదాలు జరిగాయి.  ఒకవేళ బొమ్మల మీద కూడా పిటిషన్ పడి ఉంటే వాటిని కూడా తొలగించమని కోర్టు ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉండేది.  ఇప్పుడు మాత్రం ఈ బొమ్మల మీద కోర్టులో వ్యాజ్యాలు దాఖల కావని చెప్పలేం.  త్వరలోనే ప్రతిపక్షం నుండి లేదా మరెవరైనా పిటిషన్ వేయకుండా ఉండరు.  అప్పుడు రంగుల అంశంలో జరిగినట్టే కేసులు, కోర్టులు, తీర్పులు, విమర్శలు అంటూ హడావుడి తప్పదు.  తెలుగు దేశం నేతలైతే ప్రభుత్వానికి సలహాదారులు ఏం సలహాలు ఇస్తున్నారు.  ఈ బొమ్మల విషయంలో కోర్టు మొట్టికాయలు వేయకముందే ప్రభుత్వమే తీసేస్తే మంచిది అంటున్నారు.