జగన్ ప్రచారం చేసుకోవడంలో తప్పేముంది 

TDP blaming YS Jagan's publicity
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవలే ఒకేసారి 1088 108, 104 అంబులెన్సులను ప్రారంభించిన సంగతి తెలిసిందే.  వాటిలో 336 పాతవి కాగా మిగతావన్నీ కొత్తవి.  పాత వాటిని కూడా మాడిఫై చేసి కొత్త వాటితో సమానంగా అధునాతన సదుపాయాలు ఉండేలా చేశారు.  అంబులెన్సులలో 282 బేసిక్‌ లైఫ్‌ సపోర్టు (బీఎల్ఎస్‌)కు సంబంధించినవి కాగా, 104 అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్టు (ఏఎల్ఎస్‌)తో తీర్చి దిద్దారు. మరో 26 అంబులెన్సులను చిన్నారులకు (నియో నేటల్‌) వైద్య సేవలందించేలా రూపొందించారు. బీఎల్ఎస్‌ అంబులెన్సులలో స్పైన్‌ బోర్డు, స్కూప్‌ స్ట్రెచర్, వీల్‌ ఛైర్, బ్యాగ్‌ మస్క్, మల్టీ పారా మానిటర్‌ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు.  నిజంగా ఇది గొప్ప విషయమే.  
 
 
ఈ విషయాన్ని వైకాపా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోంది.  విజయవాడలో మొదలైన అంబులెన్సులు అన్ని జిల్లాలకు ర్యాలీగా చేరుకోగా  స్థానిక నేతలు వారి వారి నియోజకవర్గాల్లో అంబులెన్సులను ప్రారంబించుకుని ప్రచారం చేసుకున్నారు.  చాలా చోట్ల వాహనాలు సైరన్ మోగిస్తూ తాము అందుబాటులోకి వచ్చామని చెబుతున్నాయి.  ఈ ప్రచారమే టీడీపీ నేతలకు, శ్రేణలకు నచ్చడం లేదు.  ఎంత మాత్రం అంబులెన్సులు స్టార్ట్ చేస్తే ఇలా ప్రచారం చేసుకుంటారా అంటూ అక్కసు వెళ్లగక్కుతున్నారు.  అయినా జగన్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అంబులెన్సులు పెట్టామని చెప్పుకోవడంలో తప్పేముంది.  
 
 
జగన్ చెసింది దానమో, ధర్మమో కాదు దాచిపెట్టుకోవడానికి.  ప్రజాధనంతో ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమం.  అలాంటప్పుడు అది జనానికి  ప్రపంచానికి తెలిసేలా ప్రచారం చేసుకోవడం తప్పేమీ కాదు.  అలా చేస్తేనే ప్రజలకు ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో ఒక అవగాహన వస్తుంది.  కానీ టీడీపీ శ్రేణులు మాత్రం అదేదో తప్పు అన్నట్టు అదే పనిగా విమర్శిస్తున్నారు.  ఒకవేళ ఇదే పని గనుక చంద్రబాబుగారు చేసుంటే ఆ హడావుడి ఏ స్థాయిలో ఉండేదో చెప్పనక్కర్లేదు.  మాములుగానే గోరంత పని చేసి కొండంత ఎలివేషన్ ఇచ్చుకుంటారు సీబీఎన్.  అదే ఇలాంటి మహత్తర కార్యక్రమం చేసుంటే ఎల్లో మీడియాలో పబ్లిసిటీ ఆకాశాన్ని తాకేది.  అప్పుడు తెలుగుదేశం శ్రేణులు చేశారు కాబట్టే చెప్పుకుంటున్నారు అనేవి.  ఇప్పుడు జగన్ చేసిది కూడ అదే.  మంచి పని చేశారు కాబట్టే గట్టిగా చెప్పుకుంటున్నారు.  అందులో తప్పుబట్టాల్సిన పనేమీ లేదు.