జగన్ డిల్లీ టూర్ గురించి టీడీపీలో టెన్షన్…టెన్షన్

 
 
దాదాపు రెండున్నర నెలల తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు డిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.  రాష్ట్రంలో నెలకొన్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల రీత్యా ఈ టూర్ అన్ని రాజకీయ పార్టీల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.  పైగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఆయన జరగబోయే సమావేశం కావడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.  ఈ సమావేశంలో కరోనా నివారణకు ఏపీ తీసుకుంటున్న చర్యలు, రాష్ట్రానికి అందాల్సిన సహాయం వంటివి ప్రధానమైన అంశాలు అయినప్పటికీ ఇతర ముఖ్యమైన అంశాలు కొన్ని చర్చకు వచ్చే అవకాశం ఉండటంతో ప్రధాన ప్రతిపక్షంలో ఆసక్తి ఎక్కువైంది. 
 
ముఖ్యంగా హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుసగా తీర్పులు రావడం, వాటిని జగన్ అండ కో ఆహ్వానించలేకపోవడం, కోర్టుల మీద అనుచిత వ్యాఖ్యలు వంటి విషయాల్లో కేంద్రం జగన్ మీద ఫైర్ అయ్యే అవకాశం ఉందని, ఒకవేళ అలా జరిగితే అధికార పార్టీ మీద ఎలాంటి విమర్శలు చేయవచ్చని ప్రతిపక్షం భావిస్తూ ఉండొచ్చు.  అలాగే మండలి రద్దు బిల్లు ఆగిపోయి ఉండటంతో ఆ బిల్లు కదిలేలా చేయడానికి జగన్ ఏమైనా చేస్తారా అని కంగారుపడుతున్నారు.  
 
అలాగే పోతిరెడ్డిపాడు, తెలంగాణ గోదావరి మీద కడుతున్న ప్రాజెక్టులు, పోలవరం వంటి విషయాలను జలవనరుల శాఖా మంత్రితో జగన్ చర్చించే ఆస్కారం కూడా ఉండటంతో వాటిలో ఎలాంటి కీలక నిర్ణయాలు జరిగినా ఏపీలో దాని ప్రభావం తప్పకుండా కనబడుతుంది.  ఇవే కాకుండా విభజన హామీల అమలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉండటంతో ఈ టూర్ ప్రాధాన్యతను సంతరించుకుంది.  మరి ఈ పర్యటన ద్వారా సీఎం వైఎస్ జగన్ తమకు అనుకూలంగా ఏవైనా వాగ్దానాలు తెచ్చుకుంటారో లేకపోతే టీడీపీకి కావల్సిన విమర్శల స్టఫ్ అందిస్తారో చూడాలి.