చికిత్స కోసం హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం.. మరి మా సంగతేమిటంటున్న ప్రజలు

కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం సమర్థవంతంగా పని చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నుండి అధికార పార్టీ నేతలంతా బల్లగుద్ది మరీ చెబుతున్నారు.  ఇప్పటివరకు రాష్ట్రంలో 11.5 లక్షల కరోనా నిర్థారణ పరీక్షలు జరిగాయి.  నిజంగా ఇది అభినందించాల్సిన విషయమే.  దేశంలోనే అత్యధిక పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పేరు తెచ్చుకుంది.  టెస్టుల విషయంలో మాత్రం ఎలాంటి వంకా పెట్టడానికి వీలులేని పనితనం ప్రదర్శిస్తోంది ఏపీ సర్కార్.  కానీ చికిత్స విషయంలోనే అనుమానాలు, ఆందోళన నెలకొన్నాయి.  టెస్టులు చేస్తే సరిపోతుందా మెరుగైన చికిత్సా సదుపాయాలు ఉండాలి కదా అంటున్నారు. 
 
ఈ విమర్శలకు కారణం ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా కరోనా ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వెళ్ళారనే వార్తలు రావడమే.  కరోనా పాజిటివ్ రావడంతో అంజాద్ భాషాకు తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్ నందు చికిత్స అందించారు.  ఆయన ఆరోగ్యం బాగానే ఉందని స్విమ్స్ డైరెక్టర్ కూడా తెలిపారు.  కానీ సంతృప్తి చెందని డిప్యూటీ సీఎం కుటుంబంతో సహా హైదరాబాద్ వెళ్లి అక్కడే ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని వార్తలు బయటికొచ్చాయి.  దీంతో ప్రజలు సోషల్ మీడియా వేదికగా ప్రజలకేమో ప్రభుత్వ హాస్పిటళ్లు, ప్రజాప్రతినిధులకేమో ప్రైవేట్ హాస్పిటళ్లా అంటున్నారు. 
 
సర్కార్ కొవిడ్ చికిత్సకు అవసరమైన అన్ని సదుపాయాలు ప్రభుత్వ వైద్యశాలల్లో ఉన్నాయని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని అంటోంది.  అలాంటిది ఆ నాయకులే ఆ సర్కార్ దావఖానాల్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి సుముఖత చూపక ప్రైవేట్ ఆసుపత్రుల వైపు పరుగులు తీస్తుంటే ఇక ప్రజల్లో ప్రభుత్వ వైద్యం పట్ల నమ్మకం ఎలా కుదురుతుంది.  కనుక నాయకులే ముందుకొచ్చి ప్రభుత్వ వైద్యశాలల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది.  అధికార పక్షం నాయకులు చికిత్స కోసం వెళుతున్నారంటే ప్రభుత్వ వైద్యశాలల నిర్వహణ, చికిత్సలో క్వాలిటీ పెరుగుతాయి.