చంద్రబాబు విశాఖ వెళ్ళకపోవడం వెనకే పెద్ద వ్యూహమే ఉండొచ్చు 

Telangana Govt Books now has a chapter on SR NTR

 

చంద్రబాబు విశాఖ వెళ్ళకపోవడం వెనకే పెద్ద వ్యూహమే ఉండొచ్చు 

 
నారా చంద్రబాబు నాయుడు విశాఖ వెళ్లి ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించాలానే ఉద్దేశ్యంతో హైదరాబాద్ నుండి అమరావతికి వచ్చారు.  వరుసగా రెండు రోజులు డిజిటల్ మహానాడు నిర్వహించిన ఆయన ఆ తర్వాత విశాఖ వెళ్లాలని భావించారు.  పార్టీ శ్రేణులు, విశాఖ కార్యకర్తలు కూడా అలాగే భావించారు.  కానీ బాబు మాత్రం మహానాడు ముగించుకుని నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయారు.  అయితే దీనిపై ఆయన కానీ పార్టీ శ్రేణులు కానీ ఎలాంటి వివరణా ఇవ్వలేదు. 
 
దీంతో అధికార పక్షం నేతలు బాబు బాధితుల పేరు చెప్పి అనుమతులు తీసుకుని మహానాడు కార్యక్రమం నిర్వహించుకుని వెళ్లిపోయారని, ఆయనకు బాధితులను పరామర్శించాలనే కనీస భాద్యత కూడా లేదని ఎద్దేవా చేశారు.  అయినా టీడీపీ శ్రేణులు మాట్లాడలేదు.  అయితే బాబు తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఒక వ్యూహం ఉన్నట్టు కనబడుతోంది.  వ్యూహంతో పాటు కొన్ని ముఖ్యమైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి. 
 
ఇప్పటికిప్పుడు చంద్రబాబు విశాఖ వెళితే గ్యాస్ లీక్ ఘటన కారకుల గురించి మాట్లాడాలి.  కానీ ఆ కంపెనీకి విస్తరణ అనుమతులు టీడీపీ హయాంలోనే వచ్చాయి.  కాబట్టి మాట్లాడలేరు.  అలాగే విశాఖను జగన్ పరిపాలనా రాజధానిగా మారుస్తాను అంటుంటే టీడీపీ వద్దని అంటోంది.  కనుక బాబు వెళితే నిరసనలు జరగొచ్చు.  అంతెందుకు వైసీపీ నేతలే విశాఖను రాజధానిగా వద్దన్న బాబు ఈరోజు విశాఖకు వచ్చారంటూ మాట్లాడతారు.  
 
అన్నిటికంటే ముఖ్యంగా ప్రజెంట్ రాష్ట్రంలో జగన్ యేడాది పాలన హడావుడి నడుస్తోంది.  ఈ తరుణంలో బాబు సాదాసీదా టూర్ చేసినా పెద్దగా ఎవరి దృష్టినీ ఆకర్షించదు.  అందుకే సరైన సమయం చూసుకుని అయన టూర్ పెట్టుకుందామనే ఆలోచన చేసి ఉండవచ్చు.  ఇక అయన ఏపీలోకి వచ్చేటప్పుడే టీడీపీ శ్రేణులు కరోనా నిబంధనల్ని తప్పి కేసుల వరకు వ్యవహారం వెళ్ళింది.  ఇప్పుడు విశాఖకు వెళితే అలాంటి సీనే రిపీట్ కావొచ్చని ఆయన భావించి వెనక్కి తగ్గి ఉండొచ్చు.