గ్రాఫిక్స్ నగరంలో బొత్స పర్యటన.. హౌ ఇట్స్ పాజిబుల్  

Botsa Sathyanarayana
టీడీపీ హయాంలో కొత్త రాజధాని అమరావతి నిర్మాణం గట్టిగానే కొనసాగింది.  పాలన భవనాలు  అధికారులు, ప్రజాప్రతినిధుల నివాసాల నిర్మాణం చాలా చురుకుగా జరిగింది.  రాజధాని పేరుతో బాబు అండ్ కో ఇన్ సైడ్ ట్రేడింగ్ చేశారని ప్రతిపక్షం ఆరోపణలు చేస్తున్నా అది నిజంగా జరిగిందో లేదో న్యాయస్థానాలు తెలుస్తాయి కానీ రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబు గట్టిగానే పనిచేశారనేది ఒప్పుకుని తీరాల్సిన నిజం.  కానీ అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ మాత్రం అమరావతఅమరావతి ఒట్టి భ్రమరావతి అని అక్కడ చెప్పుకోదగిన నిర్మాణాలేవీ జరగలేదని అంతా గ్రాఫిక్స్ మాయాజాలమని అన్నారు. 
 
 
కళ్ళ ముందు హైకోర్టు లాంటి భారీ నిర్మాణాలు కనిపిస్తున్నా అదే వాదన చేశారు.  కానీ ఇప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణ అధికార వైసీపీ తరపున రాజధానిలో కలియతిరుగేస్తున్నారు.  నిర్మాణంలో ఉన్న ఆల్ ఇండియా సర్వీస్ క్వార్టర్స్, ఎన్జీవో, హెచ్‌ఓడీస్‌ టవర్స్, జడ్జిల క్వార్టర్స్‌ను పరిశీలించారు.  ఏయే భవంతులు ఎప్పటిలోపు అందుబాటులోకి వస్తాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు.  నిన్న కరకట్ట రోడ్డును పరిశీలించారు.  దీంతో అమరావతి గ్రాఫిక్స్ అని వైసీపీ నేతలే కదా అంది, మరి అందులోనే బొత్సగారు ఎలా పర్యటిస్తున్నారు, ఇదెలా సాధ్యం.  బహుశా ఇది బొత్సగారి భ్రమ పర్యటన ఏమో అంటూ టీడీపీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నారు.  
 
 
మరోవైపు ఇన్నాళ్ళు ఆమరావతిని లైట్ తీసుకున్న జగన్, అసలు రాజధానినే అక్కడ లేకుండా చేస్తామన్న వైసీపీ ఇలా ఉన్నట్టుండి అమరావతిని పరిశీలించడం చూస్తే అంటే ఇప్పట్లో రాజధాని తరలింపు ఉండదని, ఈలోపు ఆమరావతి భవనాల పెండింగ్ నిర్మాణాలను పూర్తిచేసి అందులోనే పాలన సాగించాలనే యోచనలో అధికార పక్షం ఉందనే అనుమానాలు మొదలవుతున్నాయి.  నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పట్లో రాజధాని తరలింపు ఆలోచన లేదని అనడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చింది.