గుంతలు, వేతనాలు వైసీపీ పాలనకు ప్రతిబంధకాలు

రెండేళ్లుగా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు రోడ్ల మీద వెళ్లడం మానేశారా.? అన్న అనుమాన కలగడం సహజమే. ఎందుకంటే, రాష్ర్టంలో మనిషన్నవాడెవడూ ఎలాంటి ప్రమాదానికీ లోనవకుండా గమ్య స్థానానికి చేరడం లేదు. వాహనాలు పాడవుతున్నాయ్. మనుషుల వెన్నుపూసలూ దెబ్బతింటున్నాయ్. అయినా, రోడ్లను బాగు చేయాలన్న ఇంగితాన్ని జగన్ సర్కార్ పక్కన పడేసింది. ‘చంద్రబాబు హయాంలో మిగతావి ఎలా ఉన్నా రోడ్లు మాత్రం చాలా బాగుండేవి.. రోడ్లే అభివృద్ధికి అసలు సిసలు మార్గాలు. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా, రోజూ వెక్కిరిస్తున్న రోడ్లు ప్రజలకు ప్రభుత్వంపై చిరాకు తెప్పిస్తున్నాయ్..’ అనే ఆవేదన ప్రజల్లో పెరిగిపోతోంది. ఇదిలా ఉంటే, ప్రతినెలా మొదటి తారీఖున జీతం అందుకోవడం మర్చిపోయామంటూ ఉద్యోగులు వాపోతున్నారు.

ఉద్యోగ సంఘాల నేత ఒకరు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని, అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రతి నెలా మొదటి తారీఖున జీతం ఇచ్చేలా వైఎస్ జగన్ మనసు మారాలని దేవున్ని కోరుకున్నట్లుగా చెప్పారంటే ఉద్యోగుల్లో ఎంతటి నిర్వేదం ఉందో అర్ధం చేసుకోవచ్చు. కష్ట కాలమే.. ఓ వైపు ఆర్ధిక ఇబ్బందులూ ఇంకో వైపు కరోనా కష్టాలు. ప్రభుత్వం ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే అయినా, సంక్షేమ పథకాల్ని క్యాలెండర్ ప్రకారం అమలు చేస్తున్నట్లే జీతాల్ని కూడా సకాలంలో ఇవ్వాలని ఉద్యోగులు వేడుకుంటున్నారు. ఈ కష్టం పగవాడికీ రావద్దనీ వాపోతున్నారు. ఆర్ధికంగా చితికిపోయిన కొన్ని కుటుంబాలైతే, వేతన బాధితులమైన తమను ఆదుకునేందుకు ఏదైనా సంక్షేమ పథకం ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టాలనీ, లేదంటే, బిచ్చమెత్తుకోవడం తప్ప వేరే మార్గం తమకు లేదని కన్నీరు మున్నీరవుతున్నారు. అన్నీ చేసి ఉద్యోగుల దగ్గరికొచ్చేసరికి ప్రభుత్వం ఎందుకిలా చేస్తోంది.? అనేదే ఎవరికీ అర్ధం కాదు.