టీడీపీ గుంటూరు ఎంపీ, అమర్‌రాజా సంస్థల చైర్మన్ గల్లా జయదేవ్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. చిత్తూరు జిల్లాలోని అమర్‌రాజా ఇన్‌ఫ్రాటెక్‌కు సంబంధించిన 253 ఎకరాల భూమిని వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. గల్లా జయదేవ్ తల్లి గల్లా అరుణకుమారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలో మంత్రిగా పనిచేశారు. వైఎస్ మరణానంతరం రోశయ్య ముఖ్యమంత్రి అయ్యాక గల్లా కుటుంబానికి చెందిన అమర్‌రాజా ఇన్‌ఫ్రాటెక్‌కు 483.27 ఎకరాల ప్రభుత్వ భూమిని డిజిటల్ సిటీ నిర్మాణానికి కేటాయించారు. ఉద్యోగాల కల్పన, కొత్త పెట్టుబడులతో సంస్థ విస్తరణ ఈ ఒప్పందలోని నియమాలు.
కాగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక టీడీపీకి చెందిన నేతల వ్యాపారాలకు అప్పట్లో ప్రభుత్వం కేటాయించిన భూములపై ప్రత్యేక దృష్టి పెట్టిన సంగత తెలిసిందే. ఎవరెవరికి ఎంత భూములు ఇచ్చారు, అవన్నీ నిభంధనలకు లోబడి ఉన్నాయా లేదా, ఒప్పందాల్లోని లక్ష్యాలను నెరవేరుస్తున్నారా లేదా అనే అంశాలపై అన్ని శాఖల అధికారులు సమగ్ర పరిశీలన చేపట్టారు. అందులో భాగంగా అమర్‌రాజా ఇన్‌ఫ్రాటెక్ ఒప్పందంలో చెప్పినట్టు ఉద్యోగాల కల్పన చేయలేకపోవడం, సంస్థ విస్తరణ జరగకపోవడంతో, గత పదేళ్లలో 229.66 ఎకరాల భూమిని మాత్రమే వాడుతుండటంతో మిగిలిన 253 ఎకరాలను వెనక్కి తీసుకోవాలని నిర్నయించింది.
ఈ మేరకు ఏపీ పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య గల్లా కుటుంబానికి, వారి వ్యాపార సామ్రాజ్యానికి గట్టి ఎదురుదెబ్బ అనుకోవాలి. అసలే టీడీపీ సీనియర్ లీడర్ల మీద అవినీతి ఆరోపణలు, కేసులు, అరెస్టులతో రాజకీయ వాతావరణం వేడెక్కి ఉన్న సమయంలో ఇలా గల్లా ఫ్యామిలీ వ్యాపారాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టి భూములు వెనక్కి తీసుకోవడంతో టీడీపీలో మరింత కలకలం సృష్టిస్తోంది. మరి ఈ విషయమై ఎంపీ గల్లా జయదేవ్ ఎలా స్పందిస్తారో చూడాలి.