కేసీఆర్ మాటలకి.. హైకోర్ట్ మొట్టికాయలకి పొంతనే లేదు 

తెలంగాణ ప్రభుత్వంపై కరోనా వైరస్ కట్టడి విషయంలో రోజు రోజుకీ విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.  ప్రతిపక్షాలేమో ప్రభుత్వం తక్కువ సంఖ్యలో పరీక్షలు చేస్తూ కరోనా అదుపులో ఉందనే భ్రమ కలిగిస్తున్నాయని అంటున్నాయి.  రోజువారీ పరీక్షల లెక్కలు కూడా వారి వాదనకు బలం చేకూర్చేలానే ఉన్నాయి.  అధికారిక లెక్కల మేరకు ఈరోజు 1096 పరీక్షలు చేయగా వాటిలో 269 మందికి పాజిటివ్ అని తేలింది.  ఇక ఏపీలో ఈరోజు 15,188 శాంపిళ్లను పరీక్షించగా వాటిలో 275 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.  
 
ఈ లెక్కల్ని చూపి తెలంగాణ రాష్ట్రంలో కరోనా ప్రమాదకర స్థాయిలో ఉందని, అయినా తక్కువ సంఖ్యలోనే పరీక్షలు చేస్తున్నారని కేసీఆర్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు.  హైకోర్టు సైతం తెలంగాణ ప్రభుత్వం తీరును తీవ్ర స్థాయిలో తప్పుబట్టింది.    కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందికి ఎన్ని పీపీఈ కిట్లు, మాస్కులు ఇచ్చారో రేపటిలోగా సంబంధిత వివరాలు ఇవ్వాలని గాంధీ, నిమ్స్‌, ఫీవర్‌, కింగ్‌ కోఠి ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లకు సూచించింది.  రేపటి విచారణకు పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌, గాంధీ సూపరింటెండెంట్‌ హాజరుకావాలని ఆదేశించింది.  
 
అంతేకాదు కరోనాను ఎదుర్కొనే సన్నాద్దత ప్రభుత్వంలో తగినంతగా కనిపించడం లేదని, వైరస్‌ నియంత్రణపై ప్రభుత్వానికి ఆసక్తి, ఉత్సాహం పోయిందని, ప్రజలే ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాలన్న ధోరణి ప్రభుత్వంలో కనిపిస్తోందని చురకలు వేసింది.  అలాగే గాంధీలో జూనియర్ డాక్టర్ల సమ్మె వివాదాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. 
 
ఇలా హైకోర్టు మొట్టికాయలు వేస్తుంటే కరోనా కంట్రోల్లోనే ఉందని అంటుంటే మంత్రి ఈటెల రాజేందర్ కరోనా నియంత్రణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అంటుండటం గమనార్హం.  ఇలా సీఎం మాటలకు, హైకోర్ట్ వేస్తున్న మొట్టికాయలకు పొంతన లేకపోవడంతో కరోనా నియంత్రణ విషయంలో  ప్రభుత్వం తీరు పట్ల జనంలో అపనమ్మకం మరింత ఎక్కువయ్యే అవకాశం లేకపోలేదు.