ఇప్పటికే తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించక అల్లకల్లోలమవుతోంది. పాలనను గాలి కొదిలేసి కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారా? అంటూ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. కరోనా వైరస్ సమయంలో కేసీఆర్ ఎక్కడికి వెళ్లిపోయారoటూ? వెంటనే ఆయన ప్రజలకు కనిపించాలని డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. గత 15 రోజులుగా కేసీఆర్ ఎక్కడున్నారో? ఏం చేస్తున్నారో? తెలియకపోవడమే ఈ గందరగోళానికి తెర తీసింది అన్న సంగతి తెలిసిందే. తాజాగా సీఎం కేసీఆర్ వెంకట్రావు పేట మాజీ సర్పంచ్ కి ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. సాగు నీటిని రైతులు సద్వినియోగం చేసుకుంటు న్నారా? లేదా? అన్న విషయంపై కేసీఆర్ స్వయంగా ఆరా కోసం ఫోన్ చేసినట్లు తెలిసింది.
బుధవారం జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం వెంకట్రావు పేట మాజీ సర్పంచ్, స్థానిక రైతు, సమన్వయ సమితి సభ్యుడు శ్రీపాల్ రెడ్డితో కేసీఆర్ ఫోన్ లో మాట్లాడినట్లు తేలింది. వేములవాడ నియోజక వర్గంలో ఎన్నిమండలాలకు నీళ్లు అందుతున్నాయి అన్న వివరాలు ఆరా తీసినట్లు తెలుస్తోంది. వరద కాలువలను నుంచి నీరు గ్రామాలకు అందించే చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కొంత మంది నాయకులుతో మాట్లాడితే స్వయంగా తననే రమ్మన్నారని, అవసరమైతే వస్తానని కేసీఆర్ తెలిపారు. పూర్తి స్థాయిలో నియోజక వర్గంలో నాలుగు మండలాలకు ప్రభుత్వం తప్పక నీళ్లు అందిస్తుందని తెలిపారు.
ఈ సంభాషణ ఇరువురి మధ్య ఫోన్ కాల్ లోనే నడిచింది. ఈనేపథ్యంలో ఆ ఫోన్ కాల్ లో నిజమెంత? అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు. మనిషి కనబడకుండా ఫోన్ లో మాట్లాడటం దేనికని, ఈ వివరాలు, ఆరాలు ఎందుకోసమని ప్రశ్నిస్తున్నారు. ఆయన వెంటనే ప్రజల ముందుకొచ్చి మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు. ఈఫోన్ కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ఆయన తరుపు వారు చేయించింది అయి ఉంటుందని సందేహం వ్యక్తం చేసారు. వేర్ ఈజ్ మై కేసీఆర్ అంటూ అభిమానులు సైతం రోడ్డెక్కారంటే? పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవాలని హితవు పలికారు.