కాశ్మీర్లో ఉగ్ర కాల్పులు.. తాతను కోల్పోయిన మనవడి ఆవేదన 

కాశ్మీర్లో మళ్లీ రక్తం చిందింది.  ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు.  వారిని అంతమొందించే క్రమంలో భద్రతా దళాలు వీరోచితంగా పోరాడుతున్నాయి.  ఈరోజు ఉదయం జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలోని సోపూర్లో 7 గంటలకు ముష్కరులకు, భద్రతా దళాలకు నడున కాల్పులు మొదలయ్యాయి.  ఇదే సమయంలో అక్కడికి ఏదో పని మీద ఒక 60 ఏళ్ళ పెద్దాయన తన మూడేళ్ల మనవడిని వెంటబెట్టుకుని వచ్చాడు.  అకస్మాత్తుగా మొదలైన కాల్పుల్లో వారిద్దరూ చిక్కుకున్నారు.  ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆ పెద్దాయన శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్ళాయి.  దాంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. 
 
 
ఇదేమీ తెలియని ఆ మూడేళ్ల పసివాడు రక్తమోడుతున్న తాత శవం వద్దే కూర్చుని తాతను లేపడానికి ప్రయత్నించాడు.  ఎంతకీ తాత లేవకపోవడంతో ఆయన మృతదేహం మీద కూర్చుని తడుతూ లేపడానికి ట్రై చేశాడు.  అయినా తాత లేవలేదు.  దీంతో పిల్లాడు గుక్కపెట్టి ఏడవడం స్టార్ట్ చేశాడు.  ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.  పిల్లాడి ఆవేదన నిండిన ఆ చిత్రాలు హృదయాలను ద్రవింపజేస్తున్నాయి.  
 
 
ఇంతలో అక్కడికి వచ్చిన జవాన్ ఒకరు గోడ చాటున నిలబడి ఆ పిల్లాడిని పక్కకు రమ్మని పిలిచాడు.  దాంతో పిల్లాడు తాతను వదిలి పక్కకు వెళ్లాడు.  జవాన్లు ఆ పిల్లాడిని సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.  ఈ కాల్పుల్లో వృద్దుడితో పాటు ఒక సీఆర్పీఎఫ్ జవాన్ అమరుడవగా ఇంకో ముగ్గురు జావాన్లు గాయపడ్డట్టు తెలుస్తోంది.  మరోవైపు రాజౌరీ సెక్టార్ కేరి ప్రాంతంలో నియంత్రిత రేఖను దాటి 400 మీటర్లు లోపలికి చొచ్చుకు వచ్చిన ఉగ్రవాదుల్లో ఒకరిని సైన్యం మట్టుబెట్టి మిగిలినవారి కోసం గాలిస్తోంది.