తెలంగాణ హైకోర్టు, కరోనా విషయమై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. కరోనా వనరులుగా మద్యం దుకాణాలు మారిపోయాయని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. కరోనా కేంద్రాలుగా మద్యం దుకాణాలు మారడం పట్ల అసహనం వ్యక్తం చేసింది న్యాయస్థానం. దేశంలో కరోనా వ్యాప్తికి ప్రధాన కారణాల్లో మద్యం దుకాణాలది ముఖ్యమైన స్థానం. నిజానికి, దేశంలో కరోనా అదుపు చేయగల పరిస్థితుల్లో వున్నప్పుడు లాక్ డౌన్ నుంచి మినహాయింపు మద్యం దుకాణాలకు రావడంతోనే.. కరోనా వ్యాప్తి పెరిగింది. మద్యం దుకాణాల వద్ద పెద్దయెత్తున క్యూలైన్లు, తోపులాట.. ఈ తతంగమంతా మనం చూసిందే. మద్యం దొరక్క శానిటైజర్లను కొందరు తాగి ప్రాణాలు కోల్పోయిన వైనం కూడా చూశాం.
మద్యాన్ని ప్రధాన ఆదాయవనరుగా మార్చుకున్న ప్రభుత్వాలు, మద్యం రేట్లను పెంచి.. మద్యాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చి.. తద్వారా ఆదాయన్ని పెంచుకుంటున్నాయి. చాలా రోడ్డు ప్రమాదాలు మద్యం కారణంగా జరుగుతున్నాయి.. కరోనా వ్యాప్తి కూడా మద్యపానం వల్ల ఎక్కువగానే జరుగుతోంది.. అయినాగానీ, ప్రభుత్వాలు మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోయేందుకు సముఖంగా లేవు. కరోనా దెబ్బకి దేశం విలవిల్లాడుతున్నా.. అది ప్రజల ప్రాణాల్ని తోడేస్తున్నా.. కరోనా నియంత్రణలో భాగంగా మద్యాన్ని నియంత్రించలేకపోవడాన్ని ఏమనుకోవాలి.? ప్రభుత్వాల సంగతి పక్కన పెడితే, మద్యం విషయమై మద్యపాన ప్రియులు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే. తమ జీవితాల్ని నాశనం చేసుకోవడంతోపాటు, ఇతరుల జీవితాల్ని నాశనం చేసే హక్కు తమకు లేదని మద్యపాన ప్రియులు గుర్తించాలి. కానీ, మద్యం ఓ వ్యసనం.. మద్యానికి బానిసలైనవారి నుంచి ఆత్మవిమర్శను ఆశించలేం. ప్రభుత్వాలే తగిన చర్యలు తీసుకోవాలి.