కరోనాతో ఇంతమంది చనిపోవడం  ఇదే మొదటిసారి !

 
తెలంగాణ రాష్ట్రంలో కరోనా రోజురోజుకూ పెరిగిపోతోంది. నేడు కూడా  గ్రేటర్‌ హైదరాబాద్ లో 127 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లు ఉండగా.. దాదాపు అన్ని చోట్ల ప్రస్తుతం యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నాయంటే  ప్రస్తుత పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.  కొన్ని రోజులుగా ప్రతి రోజూ 50 నుంచి 100 వరకు కేసులు వస్తున్నా.. ఏమి చేయలేని స్థితి.  రోజుకో కొత్త ప్రాంతంలో వైరస్‌ వ్యాప్తి నిర్ధారణ అవ్వడం,  కరోనా వల్ల మరణాలు పెరగడంతో   ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే కరోనా వ్యాప్తికి కారణం లాక్‌ డౌన్‌ సడలింపులే. చాలా మంది ఇళ్ల నుంచి బయటకు రావడమే కాకుండా..  మార్కెట్లు, కిరాణా దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించకపోవడం,  పైగా కొందరు మాస్క్‌లు కూడా ధరించకపోవడంతో   జాగ్రత్తలు పాటిస్తున్నవారికి ఆందోళన కలిగిస్తోంది.  
 
అయినా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోన్నా.. ఇప్పటికీ ప్రజా రవాణా దారుణంగా ఉంది.  షేరింగ్‌ ఆటోల రాకపోకల్లో రద్దీ మరీ ఎక్కువైంది.  ఒకపక్క భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్నా  అమలుకు నోచుకోవడం లేదని ప్రజలే బాధ పడుతున్నారు.  షేరింగ్‌ ఆటోల్లో కిక్కిరిసిన ప్రయాణాలు ఇలాగే కొనసాగితే మాత్రం   పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత అధికమయ్యే ప్రమాదం ఉంది. కరోనా మహమ్మారితోటి ఈ రోజు ఆరుగురు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 105 మంది మృతి చెందారు. గడచిన నాలుగు రోజుల్లోనే ఏకంగా 23 మంది మృత్యువాత పడ్డారు.
 
తెలంగాణలో కరోనా కారణంగా  ఒక్కరోజులోనే  ఇంతమంది చనిపోవడం అంటే ఇదే మొదటిసారి. ఈ మరణాల సంఖ్యతో  ప్ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతుంది. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వైరస్‌ ఉధృతి మరింత పెరిగితే మాత్రం  మొత్తం తెలంగాణే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే  కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరి ఈ మహమ్మారి బారిన నుండి ఎలా ప్రాణాలు కాపాడుకుంటామో చూడాలి.