తెలంగాణలో మొదటి కరోనా పాజిటివ్ కేసు మొదలైనప్పటి నుంచి నేటి వరకు కోవిడ్ ఆసుపత్రిగా ఉన్న గాంధీ ఆసుపత్రికి బాగానే ప్రశంసలు అందినా అంతకు మించి విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. కరోనా ప్రభావం తక్కువగా ఉన్నప్పుడు గాంధీ ఆసుపత్రిని పూర్తిగా కోవిడ్ ఆసుపత్రిగా మార్చి ప్రతి కరోనా పేషంట్‌కి సరైన వైద్యం, మంచి పోషక ఆహారం అందిస్తూ వస్తున్నామని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ సర్కార్ ఆ తరువాత జరుగుతున్న సంఘటనలపై చేతులెత్తేసినట్టు కనిపిస్తుంది.
రాష్ట్రంలో లాక్‌డౌన్‌లో సడలింపులు ఇచ్చినప్పట్టి నుంచి కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. అప్పటి నుంచి గాంధీ ఆసుపత్రిలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆసుపత్రిలో సరైన వైద్యం అందించడం లేదని, చచ్చిపోతున్నాం కాపాడండి బాబోయ్ అన్నా కూడా ఏ ఒక్క డాక్టర్, నర్సులు కానీ పట్టించుకోవడం లేదని, ఇక మృతదేహాల తారుమారు, డెడ్‌బాడీల మిస్సింగ్ వంటి ఘటనలు ఈ మధ్య ఎన్నో వెలుగులోకి వచ్చాయి. దీంతో కరోనా సోకి చచ్చినా పర్లేదు కానీ గాంధీ ఆసుపత్రి కనుచూపు మేరకు వెళ్ళేందుకు కూడా కరోనా బాధితులు ఇష్టపడడం లేదట.
అయితే దీనిపై తెలంగాణ వైద్యారోగ్య శాఖ మాత్రం పూర్తి భిన్నంగా మాట్లాడుతుంది. గాంధీ ఆసుపత్రిలో మంచి వైద్యం అందిస్తున్నారని, కరోనా పేషంట్లకు అక్కడి సిబ్బందికి దగ్గరుండి అన్నం తినిపిస్తున్నారని అంటుంది. ఇదే నిజమైతే సీఎం కేసీఆర్ చెప్పినట్టు కరోనా సోకిన ప్రతి ఒక్కరు గాంధీలోనే చేరాలి కానీ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఎందుకు ప్రైవేట్ ఆసుపత్రులలో చేరుతున్నారనేది ఇక్కడ కాస్త ఆలోచింపదగ్గ విషయం.
ఇక తాజాగా జరిగిన ఓ సంఘటన గాంధీ ఆసుపత్రిలో జరుగుతున్న అసలు నిర్వాహకాన్ని మరోసారి భయటపెట్టింది. కరోనా కారణంగా శ్రీనివాస్ అనే రోగి చనిపోగా ఉదయం నుండి మృతదేహం బెడ్ పైనే పడి ఉంది. చనిపోయి 8 గంటలు దాటినా ఆస్పత్రి సిబ్బంది శ్రీనివాస్ మృతదేహాన్ని పట్టించుకోలేదు. దీంతో కరోనా వార్డ్ అంతా దుర్వాసనతో కంపు కొడుతుండగా, ఆ దుర్వాసన భరించలేక కరోనా పేషెంట్లు వార్డు ఖాళీ చేసి వెళ్లిపోయారంటేనే అక్కడి పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
అయితే ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వం అదేమి లేదనట్టుగానే వ్యవహరిస్తుంది. కానీ కలిబొల్లి కబుర్లు ఎన్ని చెప్పినా అసలు నిజం ఏది అనేది అర్ధం చేసుకోలేని తెలివి తక్కువ వారు ఎవరు లేరండోయ్ ఇక్కడ.. అందరూ అప్డేటెడ్..!