ఎమ్మెల్యేకు కౌంటర్ ఇస్తూ జనానికి ఎస్సెమ్మెస్ పెట్టిన ఎంపీ 

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏది చేసినా నేరుగానే చేస్తారు.  సొంత పార్టీ విధానాలను, అధినేత తీరుపై బాహాటంగానే విమర్శలు చేసిన ట్రాక్ రికార్డ్ ఆయనది.  వైఎస్ జగన్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న ఆయన ఆ కారణంగానే ఇసుక అక్రమాలు, ఇళ్ల స్థలాల్లో అవినీతి గురించి మీడియా ముందు ఏకరువు పెడుతూ సీఎం చుట్టూ ఒక కోటరీ ఏర్పడి ఉందని, దాన్ని దాటి వెళ్లడం సాధ్యంకాదని అన్నారు.  దీంతో అధిష్టానం ఆయన పట్ల గట్టిగానే రియాక్ట్ అయిందని టాక్ వినపడింది. 
కానీ రఘురామకృష్ణంరాజులో మాత్రం మార్పు లేదు.  అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన విధానం బాగోలేదని మళ్లీ వార్తల్లోకెక్కారు. 
 
ఈ తరహాలో ఎంపీ పక్కలో బల్లెం అవుతుండటంతో నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు కలుగజేసుకుని స్పందించారు.  ముఖ్యమంత్రి మీద అలా సొంత పార్టీవారే విమర్శలు చేయడం తగదని, ఆయన్ను కలవాలని మనస్పూర్తిగా కోరుకుంటే సీఎంగారి అపాయింట్మెంట్ దొరికేదని మాట్లాడారు.  అంతేకాదు సీఎం పక్క చూపులు చూస్తున్నారని ఎంపీగారు అనడం సమంజసం కాదని, ఆయన చూపు చూడబట్టే ఎంపీగారికి పార్లమెంట్ కమిటీ చైర్మన్ పదవి వచ్చిందని కాస్త గట్టిగానే మాట్లాడారు. 
 
ఎమ్మెల్యే వ్యాఖ్యల పట్ల కూడా రఘురామకృష్ణంరాజు తనదైన శైలిలో స్పందించారు.  విమర్శలు చేసిన ప్రసాదరాజుకు సమాధానం ఇవ్వకుండా నియోజకవర్గంలోని కార్యకర్తలకు ఎస్సెమ్మెస్ ద్వారా సందేశం పంపారు.  అందులో ‘నా మీద చేసిన వ్యాఖ్యలతో ప్రసాదరాజుకి మంత్రి పదవి వస్తుంది.  ఎమ్మెల్యేతో ఇలా ఎవరు మాట్లాడించారో నాకు తెలుసు.  నేను సీటు అడిగానో లేక బతిమాలితే వచ్చానో, నాకు పార్లమెంట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరు ఇచ్చారో ఆయనకు తెలుసు.  ప్రజల నుండి డబ్బు వసూలు చేసి ఆ సొమ్ముతో ఫోటోలు దిగడానికి నేను వెళ్ళలేదు.  జగన్‌తో ప్రత్యేకంగా మాట్లాడదామని టైమ్ అడిగితే ఇవ్వలేదు.  ఏదేమైనా ప్రసాదరాజుకి మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.  దీంతో నియోజకవర్గంలో రాజకీయం కాస్తంత వేడెక్కింది.