ఎంపీ ఎఫెక్ట్.. పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు

YSRCP MLA's giving police complaints against MP
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్న ప్రధాన రగడ ఎంపీ రఘురామకృష్ణరాజు.  ఎంపీ వైకాపా తీరు మీద చురకలు వేయడంతో మొదలైన వివాదం ఆ తర్వాత టీవీ ఛానెళ్ళకు ఎక్కింది.  అక్కడ రఘురామరాజు మరింత పదునుగా మాట్లాడటంతో వైకాపా లీడర్లు రివర్స్ అయ్యారు.  మెల్లగా గొడవ పెద్దదైంది.  రఘురామరాజు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలే ఆయనపై విమర్శలు చేసి ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.  దీంతో ఎంపీ పోలీసులను ఆశ్రయించారు.  ఫలితం లేకపోవడంతో నేరుగా పంచాయితీని ఢిల్లీకి తీసుకెళ్ళారు. 
 
దీంతో వైకాపా ఎంపీకి షోకాజ్ నోటీసులు పంపగా తిరిగి ఆయనే తన సమాధానంతో షాకిచ్చారు.  ఇక లాభం లేదని ఆయనపై అనర్హత వేటు వేయించాలని ఢిల్లీ వెళ్లి స్పీకర్ ఓంబిర్లాను కలిసింది వైకాపా బృందం.  ఈలోపు రఘురామరాజు తనపై అనర్హత వేటు వేయకుండా చూడాలని కోర్టును ఆశ్రయించారు.  ఇలా ప్రతి దశలో రఘురామరాజు గట్టిగా రివర్స్ అవుతూనే ఉండటంతో వైకాపా కొత్త దారి వెతుక్కుంది.  ఎమ్మెల్యేలు ఎంపీ మీద పోలీసులకు పిర్యాధులు చేస్తున్నారు.  ఇప్పటికే మంత్రి శ్రీరంగనాథరాజు పోలీస్ పిర్యాధు చేయగా తాజాగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తన సహచర ఎమ్మెల్యేలను ఎంపీ అనుచిత పదజాలంతో కించపరిచారని పిర్యాధు చేశారు. 
 
నిజానికి ఎంపీ మీడియాలో లేదా తన లేఖల్లో ఎక్కడా అసభ్య పదజాలాన్ని వాడలేదు.  కానీ  కంప్లైంట్ చేయడానికి అదొక నెపం మాత్రమే.  మరొక ఎమ్మెల్యే ప్రసాదరాజు అయితే పార్టీలో వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని రఘురామరాజు మీద పిర్యాధు చేశారు.  ఇంకో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఇలాగే కంప్లైంట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.  మరి రఘురామరాజు పిర్యాదు చేస్తే చర్యలకు ఉపక్రమించని పోలీసులు ఇప్పుడు ఎమ్మెల్యేల పిర్యాధులకు స్పందిస్తారో లేదో చూడాలి.