ఇళ్ల స్థలాల పంపిణీలో అవినీతి జరుగుతోందంటున్న వైసీపీ ఎంపీ 

 
ఇళ్ల స్థలాల పంపిణీలో అవినీతి జరుగుతోందంటున్న వైసీపీ ఎంపీ 
 
వైసీపీ ఎంపీల్లో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు తీరు ప్రత్యేకమైనది.  ప్రతిపక్షం మీద ఎంతలా విమర్శలు చేస్తారో సొంత పార్టీ మీద కూడా అదే విధంగా విమర్శలు గుప్పిస్తారు.  తమ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు తప్పని ఆయనకు అనిపిస్తే మొహమాటం లేకుండా మీడియా సమక్షంలో చెప్పేస్తుంటారు.  అంతేకాదు తప్పులు జరిగితే వెంటనే బయటపెట్టేస్తుంటారు.  చేసింది మనవాళ్లా, వేరే పార్టీ వ్యక్తులా అని ఆలోచించరు.  ఇటీవల శ్రీవారి ఆస్తుల విక్రయం విషయంలో టీటీడీ నిర్ణయాని, ప్రభుత్వ తీరును తాను వ్యతిరేకిస్తున్నాను అంటూ వార్తలకెక్కిన ఆయన ఇకపై ప్రభుత్వ పథకాల అమలులో జరుగుతున్న అవినీతిని బయటపెట్టి షాకిచ్చారు. 
 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో అవినీతి జరుగుతోందని ఆయన అన్నారు.  కొందరు వ్యక్తులు లబ్దిదారుల వద్ద నుండి ఒక్కో ఇంటి స్థలానికిగాను 20 నుండి 60 వేలు లంచం అడుగుతున్నట్టు తనకు పిర్యాధులు అందాయని, దీనిపై జిల్లా కలెక్టర్ వద్ద పిర్యాధు చేసి, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరానని అన్నారు.  అంతేకాదు సీఎం జగన్ పట్ల ప్రేమ, మర్యాద ఉన్న వ్యక్తులు ఎవరూ లంచం ఇవ్వొద్దని, ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబరుకు కంప్లైంట్ ఇవ్వాలని కోరారు.  
 
ఎంపీ స్థాయిలో ఉన్న నేత ఇలా బహిరంగంగా తాము చేపడుతున్న సంక్షేమ కార్యక్రమంలో కొందరు అవినీతికి పాల్పడుతున్నారని అనడం ఆశ్చర్యం, మంచి పరిణామం కూడా.  ఇది ఒకరకంగా ప్రభుత్వ పారదర్శకతకు పదును పెడుతుంది.  బయటి పార్టీల నేతల ఆరోపణలు అవినీతిని ఆపలేకపోవచ్చు కానీ సొంత నేతల పిర్యాధులు తప్పకుండా ఫలితాన్నిస్తాయి.  ఈ విషయంలోనే కాదు ఈసీ రమేష్ కుమార్ అంశంలో కూడా తాను హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని రఘురామ కృష్ణ రాజు అనడం సర్వత్రా ఆసక్తిని రేపింది.