అదును చూసి పంజా విసిరిన జగన్

ఈరోజు తెల్లవారుజామున టీడీపీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.  టెక్కలిలోని ఆయన స్వగృహానికి సుమారు 100 మంది పోలీసులు వెళ్లి ఆయన్ను అరెస్ట్ చేశారు.  గత ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐ మందుల కొనుగోలు విషయంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోణతో అచ్చెన్నాయుడును ఏసీబీ అదుపులోకి తీసుకుంది.  ఈ అరెస్ట్ వెనుక సీఎం జగన్ యొక్క కక్ష సాధింపు చర్య ఉందని టీడీపీ ఆరోపిస్తోంది.  ఎందుకంటే వైఎస్ జగన్ మీద అచ్చెన్నాయుడు తొలి నుండి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూనే ఉన్నారు.  
 
జగన్ సీఎం అయ్యాక కూడా పలు అంశాల్లో ఆయన మీద అచ్చెన్నాయుడు విరుచుకుపడేవారు.  అసలు జగన్ పాలన మొత్తం అవినీతిమయమని అనేవారు.  చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి పెట్టుబడులు విపరీతంగా వస్తే జగన్ బెదిరింపుల పాలన వలన అవన్నీ వెనక్కిపోయాయని, జగన్ ఏడాది పాలనలో ప్రజలకు ఏడుపులే మిగిలాయని ఎద్దేవా చేసేవారు.  ఆరంభంలో చేసిన ప్రజావేదిక కూల్చివేత నుండి మొదలుకుని రాష్ట్ర తలసరి ఆదాయం పడిపోయిందని, మద్యం, ఇసుక మాఫియా నడుపుతున్నారని, తండ్రిని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు కొట్టేశాడని, రౌడీ రాజ్యం నడుపుతున్నారని అనేవారు.  
 
చివరికి కరోనాలో వాడిన బ్లీచింగ్ పౌడర్లో 70 కోట్ల స్కామ్, కరోనా కోట్లలో 40 కోట్ల స్కామ్, 600 ఎకరాల ఆవ భూముల్లో స్కామ్ అంటూ, 3500 కోట్ల బీసీల నిధులు కొట్టేశారని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.  అంతేనా వైఎస్ జగన్, విజయసాయి రెడ్డిల మధ్యన అపోహలు ఉన్నాయని కూడా మాట్లాడేవారు.  అసలు టీడీపీ నుండి చంద్రబాబు కంటే అచ్చెన్నాయుడే జగన్ మీద ఎక్కువగా విరుచుకుపడేవారు.  ఇది జగన్, వైసీపీ నేతలకు పెద్ద ఎత్తున తలనొప్పిగా పరిణమించింది.  అందుకే జగన్ అదును చూసి పంజా విసిరారని చెప్పుకుంటున్నారు.  ఈ ఈఎస్ఐ స్కామ్ మీద జగన్ సర్కార్ మొదటి నుండే ఎక్కువ ఆసక్తితో ఉంది.  సీబీఐ సమగ్ర దర్యాప్తు చేసి అవినీతి జరిగిందని నిర్థారించి అచ్చెన్నాయుడు పేరును నేరుగానే ప్రస్తావించారు.  
 
అయితే ఇంత హడావుడిగా అచ్చెన్నాయుడుపై జగన్ ప్రతాపం చూపుతారని ఎవరూ అనుకోలేదు.  పైగా నిన్న జగన్ కేబినెట్ భేటీ నిర్వహించి చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుని మరుసటిరోజు కల్లా అచ్చెన్నాయుడును అరెస్ట్ చేయడంతో జగన్ గురిపెట్టి మరీ పక్కా ఆధారాలతో దెబ్బకొట్టారనే మాటలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి.