కేరళ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం రాష్ర్ట రాజకీయాలతో పాటు కేంద్రం రాజకీయాలను కుదిపిస్తోన్న సంగతి తెలిసిందే. కేరళ ముఖ్యమంత్రి సహా కేంద్రలో బీజేపీ నాయకులు, ఐఏఎస్ లు, ఐపీఎస్ లు , జాతీయ, అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ అధికారులు ఇలా పెద్ద తలకాయల పేర్లే తెరపైకి వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని స్వప్న సురేష్ అలియాస్ స్వప్న సుందరి అనే కిలాడీ లేడీ నడిపినట్లు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని ఎన్ ఐ ఏ సమగ్రంగా దర్యాప్తు చేస్తోంది.
ఎవరికి వారు క్లీన్ చీట్ తో బయటకు రావాలని మరో వైపు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇందులో దొంగ ఎవరు? దొర ఎవరు? అన్నది తేలడానికి సమయం పడుతుంది. అయితే తాజాగా ఈ వ్యవహారంలో ఉగ్ర లింకులు ఉన్నట్లు తెరపైకి వచ్చింది. బంగారాన్ని అక్రమంగా తరలించడం వెనుక టెర్రర్ లింక్స్ ఉన్నాయనే అనుమానాలు ఎన్ ఐ ఏ వ్యక్తం చేస్తోంది. గోల్డ్ స్కామ్ ద్వారా ఉగ్ర కార్యకలాపాలకు పెద్ద ఎత్తున ఫండింగ్ వెళ్తున్నట్లు ఎన్ ఐ ఏ అనుమానిస్తోంది. ఈ కేసును ఆ కోణంలో కూడా విచారించాలని భావిస్తోందిట.
తివేండ్రం ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు ఒక గోల్డ్ కంజైన్ మెంట్ ని మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. ఇంకా బ్యాగుల ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ నుంచి బంగారం అక్రమంగా తరలించినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థను, జాతీయ భద్రతను ప్రమాదంలోకి నెట్టేలా టెర్రర్ నెట్ వర్క్ వెనుకుండి తమకు కావాల్సిన ఫండింగ్ ఏర్పాటు చేసుకుని, దేశాన్ని అన్నిరకాలుగా దెబ్బ కొట్టేలా వెనుకుండి పావులు కదుతపున్నట్లు ఎన్ ఐ ఏ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో స్వప్న సుందరి వెనుక టెర్రర్ మూక కూడా ఉందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.