దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ జయంతి సందర్భంగా ఆయనకు సంబంధిన ఎన్నో విశేషాల పై వైఎస్సార్ సతీమణి విజమమ్మ `నాలో నాతో వైఎస్సార్` అనే ఓ పుస్తకాన్ని రచించిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకాన్ని వైఎస్సార్ తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ పుస్తకం టైటిల్ తోనే విజయమ్మ వైఎస్సార్ గురించి తన మనసులో మాటలకి అక్షర రూపం ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయమ్మ 37 ఏళ్ల జీవితసారమే ఈ పుస్తకం. ఈ పుస్తకం గురించి క్లుప్తంగా ఓసారి తెలసుకునే ప్రయత్నం చేద్దాం.
వైఎస్సార్ గురించి ఈ లోకం ఏమనుకున్నది, తాను ప్రజల నుంచి తెలుసుకున్నది, ఆయన గురించి ప్రజలకు తెలియని కొన్ని విశేషాలను తెలిపేందుకే ఈ పుస్తకాన్ని తీసుకొస్తున్నట్లు విజయమ్మ తొలి పలుకులో తెలిపారు. వైఎస్సార్ తండ్రిగా, భర్తగా, అన్నగా, తమ్ముడిగా, అల్లుడిగా, మామగా, స్నేహితుడిగా, నాయకుడిగా, రియల్ లైఫ్ లో వైఎస్సార్ వేర్వేరు పాత్రలో ఎలా ఉండేవారు అన్నది ఈ పుస్తకంలో వివరించినట్లు విజయమ్మ తెలిపారు. మహా నేత వేసిన ప్రతీ అడుగు వెనుక ఉన్న ఆలోచన, అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను బుక్ లో పొందుపరిచారు. ఇంట గెలిచి..రచ్చ గెలిచిన తీరును, ఇంట్లో సభ్యులుగా ప్రజలను చూసుకున్న విధానం గురించి విజయమ్మ ముందుమాటలో వివరించారు.
వైఎస్సార్ తన జీవితమంతా పెంచి, పంచిన మంచితనం, సంపద తన పిల్లలు, మనవలకే కాకుండా ఇంటింటా పెరగాలనే సంకల్పంతోనే పుస్తకాన్ని సవినయంగా సమాజం ముందుకు తీసుకొచ్చామని తెలిపారు. ఆయన్ని ప్రేమించిన తెలుగు ప్రజలందరికీ ఈ పుసక్తం అంకితమిస్తున్నానన్నారు. వైఎస్సార్ తో విజయమ్మ వివాహం, పిల్లలు, పేదల డాక్టర్ గా ఖ్యాతికెక్కిన తీరు, రాజకీయల్లోకి ప్రవేశం వంటి అంశాలను పుస్తకంలో వివరించారు. వైఎస్ జీవితమే ఓ తెరిచిన పుస్తకంగా విజయమ్మ అభివర్ణించారు.