రండి..కలవండి.. ఎంపీ, ఎమ్మెల్యేలకు జగన్ బంపరాఫర్ 

వైసీపీ నేతలు కొందరిలో ఉన్న అసంతృప్తికి ప్రధాన కారణం ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసే అవకాశం రాకపోవడం.  అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు ఉన్న కొద్ది మంది ఎంపీ, ఎమ్మెల్యేలకు మినహా మిగతా వారికి ఇప్పటికీ జగన్ దర్శన భాగ్యం కలగలేదు.  అందుకే ఎంపీ రాఘురామరాజు సీఎం చుట్టూ ఒక కోటరీ ఏర్పడిందని, దాన్ని దాటుకుని వెళ్ళడం సాధ్యంకాదని, అందుకే తమ సమస్యలను మీడియా ముందు చెప్పుకుంటున్నామని, ఇలాగైనా తమ గోడు సీఎం వింటారని చెప్పుకొచ్చారు.  ఆయన తర్వాత పలువురు ఎమ్మెల్యేలు ఇలాగే మీడియా ముందుకొచ్చారు. 
 
 
దీంతో వైసీపీ నేతల్లో అసహనం తారాస్థాయికి చేరిందని, పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయని వార్తలు పుట్టుకొచ్చాయి.  మొదట్లో వీటిని లైట్ తీసుకున్నా ఆ తర్వాత అధిష్టానం ఆలోచనలో పడింది.  జగన్ ఇప్పటి వరకు కలవని నేతలను ఒకసారి కలిసి మాట్లాడితే బాగుంటుందని డిసైడ్ అయ్యారు.  అందుకే విడతల వారీగా ఎంపీ, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు.  నిన్న కొంతమందిని కలిసిన సీఎం వారి నియోజకవర్గ సమస్యల గురించి తెలుసుకున్నారట.  దాదాపు ఎమ్మెల్యేలందరి వినతుల పట్ల సానుకూలంగానే స్పందించారట. 
 
 
 
ఈరోజు బుధవారం కూడా ఇంకొంతమందిని కలిసి వారి ప్రతిపాదనలను కూడా తీసుకుంటారట.  దీంతో ఇంతవరకు సీఎంను కలిసే అవకాశం రాని చాలా మంది నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  ఇన్నాళ్ళు ఎవరి నియోజకవర్గాల్లో వారు స్తబ్దుగా ఉన్న లీడర్లంతా భవిష్యత్తులో ఏదో ఒక అభివృద్ది కార్యక్రమం చేపట్టవచ్చనే ఉత్సాహంలో ఉన్నారు.  పార్టీలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్న తరుణంలో జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ముమ్మాటికీ మంచిదే.  ఈ పద్దతినే సీఎం ఇక మీదట కూడా కొనసాగిస్తే పార్టీలో అంతర్గత కలహాలకు పెద్దగా ఆస్కారం ఉండదు.