మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట సురేష్ కు హైకోర్టులో చుక్కెదురైంది. సురేష్ వేసిన పిటీషన్ ని హైకోర్టు తిరస్కరించింది. రాజకీయ కక్షతో ఈ కేసులో సురేష్ ని ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సురేష్ తరుపున న్యాయవాది వాదనలు వినిపించారు. సురేష్ ఏనాడు పదవిని దుర్వినియోగ పరచలేదని, అలాగే మురళీ మోహన్ కు కూడా ఈ కుంభ కోణంతో ఎలాంటి సంబంధం లేదని వాదించారు. అందువల్ల సురేష్ కి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వాలని అభ్యర్ధించారు. ఈ వాదనని ఏసీబీ తరుపున న్యాయవాది విబేధించారు. ఇలా ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం చివరికి ముందస్తు బెయిల్ పిటీషన్ ని తిరస్కరించింది.
దీంతో ఏసీబీ అధికారులకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే సురేష్ పరారీలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు అలెర్ట్ ప్రకటించారు. సురేష్ ఎక్కడ కనిపించిన అరెస్ట్ చేయాలని ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పితాని వద్ద పనిచేసిన మురళీ మోహన్ ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ నేపథ్యంలో ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ఇంతలోనే సురేష్ పరారవ్వడం…హైకోర్టు పిటీషన్ రిజర్వలో పెట్టడం జరిగింది. తాజాగా పిటీషన్ సోమవారం విచారణకు రావడం…దాన్ని కొట్టేయడం అతా వేగంగా జరిగిపోయింది.
ఇక ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సహా పలువురు అధికారులు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తాజా పరిస్థితుల నేపథ్యంలో వెంకట సురేష్ ఏ క్షణమైనా పట్టుబడే అవకాశం ఉంది. అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చట్టపరంగా ముందస్తు కార్యచరణ అంతా సిద్దం చేసి పెట్టుకున్నట్లు తెలుస్తోంది.