ఈఎస్ఐ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత అచ్చెన్నాయుడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఏసీబీ అధికారులు కేసును తీవ్రంగా పరిగణించి దూకుడుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆరోగ్యం సరిగా లేదని అచ్చెన్నాయుడు వాపోతున్నా ఏసీబీ కనికరించడంలేదు. దానికి తోడు కోర్టులో బెయిల్ పిటిషన్లు తిరస్కరించబడుతుండటంతో అచ్చెన్నాయుడు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. విచారణలో ఇంకెవరి పేర్లైనా బయటికొస్తే వారిని కూడా అరెస్ట్ చేసేందుకు ఏసీబీ రెడీగా ఉంది.
అధికార పక్షం సైతం ఈ కుంభకోణంలో ఇంకొందరు తెలుగుదేశం నేతలు ఉన్నారని, అచ్చెన్నాయుడు అప్రూవర్ అయి నిజం చెబితే నారా లోకేష్ కూడా జైలుకు వెళతారని అంటున్నారు. ఇక ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన మొదట్లో మరొక నేత పితాని సత్యనారాయణ పేరు కూడా చర్చకు వచ్చింది. కానీ పితాని మాత్రం తనకు, ఈఎస్ఐ అంశంతో అసలు సంబంధమే లేదని అన్నారు. అయితే పితాని కుమారుడు వెంకట సురేశ్, పితాని మాజీ కార్యదర్శి మురళీ మోహన్ పేర్లు సైతం నిందితుల జాబితాలో ఉన్నాయి. వీరికి వ్యతిరేకంగా ఒక చిన్న ఆధారం దొరికినా ఏసీబీ వీరిని అరెస్ట్ చేసేస్తుంది.
కానీ మొదటి నుండి తాము క్లీన్ అంటూ వచ్చిన వెంకట సురేశ్, మురళీ మోహన్ ఇద్దరూ నిన్న ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. కేవలం రాజకీయ కక్షతో ఈ కేసులో ఇరికించారని పిటిషనర్ల తరఫు న్యాయవాది చల్లా అజయ్ కుమార్ వాదించారు. వెంకట సురేశ్ ఏనాడూ తన తండ్రి పదవిని దుర్వినియోగం చేయలేదని, ఆయన వద్ద కార్యదర్శిగా పనిచేసిన మురళీ మోహన్‌కు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధమూ లేదని, ఏసీబీ అధికారులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ వ్వహారం చూస్తే అచ్చెన్నాయుడి కష్టాలను చూసి మిగతా వారిలో భయం పుట్టినట్టు అనిపిస్తోంది.