దేశ రాజధాని ఢిల్లీలో లాక్ డౌన్ ప్రకటించారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. లెఫ్టినెంట్ గవర్నర్ – ముఖ్యమంత్రి మధ్య చర్చల అనంతరం కీలకమైన ప్రకటన వెలువడింది. ‘లాక్ డౌన్’కి తాను వ్యతిరేకం అనీ, కానీ పరిస్థితులు చెయ్యదాటిపోతున్న దరిమిలా, వైరస్ కట్టడి కోసం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. నేటి రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు కేజ్రీవాల్. అత్యవసర సేవలకు మాత్రమే ప్రత్యేక వెసులుబాటు వుంటుందని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. వలస కార్మికులెవరూ ఢిల్లీ విడిచి వెళ్ళాల్సిన అవసరం లేదనీ, వారందర్నీ ప్రభుత్వం ఆదుకుంటుందనీ కేజ్రీవాల్ అన్నారు. ‘లాక్ డౌన్ పొడిగింపు వుండకూదనే కోరుకుంటున్నాను. కానీ, పరిస్థితులు చెయ్యిదాటితే ఏమీ చేయలేం..’ అంటూ లాక్ డౌన్ పొడిగింపుపైనా దాదాపు క్లారిటీ ఇచ్చేశారు కేజ్రీవాల్. ఇప్పటికే మహారాష్ట్రలో లాక్ డౌన్ తరహా నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తున్న విషయం విదితమే.
తమిళనాడులోనూ నైట్ కర్ఫ్యూ విధించారు. మరికొన్ని రాష్ట్రాలూ నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ వంటి వాటిని అమల్లోకి తెచ్చాయి. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. రోజువారీ కేసులు రెండున్నర లక్షలు దాటేసి, మూడు లక్షల దిశగా అడుగులేస్తున్నాయి. ఈరోజే 3 లక్షల మార్కుని (రోజువారీ కేసుల పరంగా) అందుకునే అవకాశమూ లేకపోలేదు. ప్రధానంగా మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో కరోనా పట్టపగ్గాల్లేకుండా వ్యాప్తి చెందుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, ఆంధ్రపదేశ్‌లో పరిస్థితి భయానకంగా మారుతోంది. అయినాగానీ, అక్కడ కనీసపాటి జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవడంలేదు ప్రజలు. టెస్టుల సంఖ్య తక్కువగా వుండడం, పాజిటివిటీ అనూహ్యంగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఏదిఏమైనా దేశం ఇంకోసారి లాక్ డౌన్ అంటే తట్టుకునే పరిస్థితి లేదు. కానీ, కరోనా మహమ్మారి విజృంభణ ఇప్పట్లో ఆగేలా కూడా లేదు.