ప్రస్తుతం తెలంగాణ రాష్ర్టంలో కరోనా వైరస్ ఎలా తెగబడుతుందో చెప్పాల్సిన పనిలేదు. జీహెచ్ ఎంసీలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. వైరస్ కట్టడి విషయంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని ఇప్పటికే ప్రతిపక్షాలు సహా సాధారణ ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత 15 రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు కనిపించకుండాపోయారు. వేర్ ఈజ్ కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున రచ్చే జరిగింది. ఆయన కనిపించకపోవడంతో ఆయన అభిమానులు మనస్థాపానికి గురవుతున్నారు. అటు ప్రతిపక్షాల విమర్శల దాడి పతాక స్థాయికి చేరుకుంది. ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్ మాత్రం ఇప్పటివరకూ కనిపించలేదు.
ఈ నేపథ్యంలో ఉన్నట్లుండి కేసీఆర్ ఓ నియోజిక వర్గం మాజీ సర్పంచ్ తో ఫోన్ చేసి మాట్లాడినట్లు బుధవారం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కాల్ లో వాస్తవం ఎంత అన్నది తెలియాలి. ఆ విషయం పక్కనబెడితే తాజా పరిస్థితుల నేపథ్యంలో రాష్ర్టంలో రాష్ర్ట పతి పాలన విధించాలంటూ డిమాండ్లు మొదలయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రజా పాలనలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని, కరోనా కట్టడిలో ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో వెంటనే రాష్ర్టంలో రాష్ర్టపతి పాలన విధించాలని డిమాండ్ చేసారు.
జీహెచ్ ఎంసీ ఫరిదిలో రోజు రోజుకి కేసుల సంఖ్య పెరిగిపోవడం, మరణాల సంఖ్య పెరగడం, ప్రయివేటు ఆసుపత్రుల దోపీడిపై ప్రభుత్వం మాట్లాడకపోవడం వంటి చర్యలు ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందన్నారు. రాష్ర్ట ప్రజలు నానా అవస్తలు పడుతున్నారని, ఆ పరిస్థితులను మార్చాల్సిన అవసరం కేంద్రంపై ఉందని డిమాండ్ చేసారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా, రాష్ర్టంలో బీజేపీ నాయకులు చెబుతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఇది నియంత పాలనకు పోకడంటూ మండిపడ్డారు. ప్రజలే కేసీఆర్ పని తీరును, తాజా పరిస్థితులను సోషల్ మీడియా వేదికగా దుయ్య బెడుతుంటే అధికారంలో ఉన్న మిగతా మంత్రులు, నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.