మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి విమర్శకు దిగారంటే పూర్తి అధ్యయనంతోనే వస్తారనేది చాలామంది అభిప్రాయం. సూటిగా సుత్తి లేకుండా విషయాన్ని తేల్చిపారేయడం ఉండవల్లిగారి స్టైల్. అందుకే ఆయన జగన్ పాలన మీద పెట్టిన తాజా మీడియా సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. జగన్ పాలనలోని పలు అంశాలకు ప్రస్తావించిన ఆయన ఎక్కువ శాతం ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. ప్రధానమైన ఆవ భూముల కొనుగోలులో అవినీతి జరిగిందనే అనుమానం తనకుందన్నారు.
విలువలేని ఆవ భూములను 43 లక్షలు చెల్లించి కొనడం ఏమిటో తనకు అంతుబట్టడం లేదన్న ఆయన తనకు తెలిసి ఆ భూములకు అంత విలువఉండనే ఉండదన్నారు. పైగా అలాంటి భూములు ఇంకా ఉంటే అదే అధిక ధర చెల్లించి కొంటామని కలెక్టర్ అన్నారు. నిబంధనల ప్రకారమే ఆవ భూముల కొనుగోలు జరిగిందని, ఒకే చోట ల్యాండ్ దొరికింది కనుకే త్రీ పర్సెంట్ మాత్రమే అధికంగా చెల్లించామని ఆర్థికశాఖ మంత్రి చెప్పారని ఉండవల్లి తెలిపారు. అయితే ఏ రూల్ ప్రకారం చూసినా అంత డబ్బు ఇవ్వటానికి కుదరదన్నారు. రిజిస్ట్రేషన్ వ్యాల్యూ దానిమీద ఎంత పెంచొచ్చు అనేది 2013 యాక్ట్ లో చాలా క్లారిటీగా ఉందన్నారు. మరి వీళ్లు ఏ రకంగా ధర పెంచారో తనకు అర్థం కాలేదన్నారు.
తెలిసి కూడా అంత ధర పెట్టి కొంటే అది అసమర్థతే అవుతుందని లేకపోతే అవినీతి అవుతుందని మండిపడ్డారు. పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చాం అంటే ఇచ్చామని చెప్పుకోవడానికి ఇలా విలువలేని భూములు ఇవ్వడం సరికాదని ఇంకో రెండేళ్లు పట్టినా మంచి భూములే ఇవ్వాల్సిందని అన్నారు. ఈ భూముల కొనుగోళ్లపై సీబీఐ దర్యాప్తు కోరతామని అన్నారు. అలాగే జగన్ పాలనలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని దీని వలన ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టమని వ్యాఖ్యానించారు. అలాగే మద్యం ధరల పెంపుతో మద్య నిషేధం జరగదన్న ఆయన కరోనా నివారణలో కూడా ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.