జంపింగ్ ఎమ్మెల్యేల భవిష్యత్తుకు జగన్ నో గ్యారెంటీ

తెలుగుదేశం నుండి సుమారు 10 మంది ఎమ్మెల్యేలు బయటికి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారని ఇప్పటికే ఆ పార్టీ నుండి బయటికి వెళ్లిన ఎమ్మెల్యేలు అంటున్నారు.  నిన్న మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే మద్దాలి గిరి చంద్రబాబు పని అయిపోయిందని అంటూ ఇంకొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి రెడీగా ఉన్నారని చెప్పారు.  అయితే రెడీగా ఉన్నవాళ్లను అధికార పక్షం తమలో కలుపుకుంటుందా లేదా అనేది మాత్రం చెప్పలేదు.  ఎందుకంటే మద్దాలి గిరితో పాటు పార్టీని వీడిన వల్లభనేని వంశీ, కరణం బలరాంలు అధికారికంగా వైసీపీలో లేరు. 
 
సాంకేతికంగా వారంతా టీడీపీ ఎమ్మెల్యేలే.  కానీ అన్ని విషయాల్లో అధికార వైసీపీకి మద్దతిస్తుంటారు.  వలసలను ప్రోత్సహించమని, టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలని మొదట్లోనే జగన్ కండిషన్ పెట్టారు.  ఆ కండిషన్ మూలంగా పార్టీని వీడిన ముగ్గురూ అనధికారికంగా వైసీపీకి పనిచేస్తూ పొందాల్సిన బెనిఫిట్స్ అన్నీ పొందుతున్నారు.  నైతికత అంటూ మాట్లాడిన వైసీపీ సైతం పేరుకి వాళ్లను పార్టీలో అధికారంగా చేర్చుకోలేదు కానీ టీడీపీకి వ్యతిరేకంగా పనిచేయించుకుంటున్నారు. 
 
అసలు ఈ అనఫిషియల్ వ్యవహారాలు ఎందుకు టీడీపీని వీడిన వారు జగన్ అన్నట్టు ధర్జాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్లిపోవచ్చు కదా అంటే అప్పుడు మొదటికే మోసం వస్తుంది.  టీడీపీని వీడిన వీరు రాజీనామా చేసి బైఎలక్షన్లకు వెళితే గెలుస్తారనే నమ్మకం లేదు.  ఒకవేళ ఉపఎన్నికల్లో టీడీపీ లేదా జనసేన నిలబెట్టిన అభ్యర్థులు గెలిస్తే అధికారంలో ఉండి కూడా నమ్మి వచ్చి, పదవులకు రాజీనామా చేసిన వారిని గెలిపించుకోలేకపోయారు అనే అపవాదు జగన్ మీద పడుతుంది.  అది ఇంకా ప్రమాదకరం.  కాబట్టే టీడీపీని వీడిన ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామన్నా వైసీపీ ఒప్పుకుని ఉండకపోవచ్చు.  
 
ఈ ముగ్గురే కాదు ఇకపై టీడీపీ నుండి ఎవరు బయటికెళ్ళినా వారి పరిస్థితీ ఇంతే.  వీరికి నెక్స్ట్ ఎన్నికలకు వైసీపీ నుండి టికెట్ దక్కుతుందనే నమ్మకాలు కూడా చాలా తక్కువ.  అప్పటికప్పుడు లెక్కలు మారి పార్టీలోని పాతవారికే టికెట్ ఇచ్చి వారి గెలుపు కోసం పనిచేసి మీ విశ్వసనీయతను నిరూపించుకోండి అంటూ జగన్ నుండి ఆదేశం వచ్చినా ఆశ్చర్యపోనకర్లేదు.  టీడీపీలో అయినా ఉంటే జగన్ హవాను తట్టుకుని గెలిచిన వాళ్ళు కాబట్టి ఈసారి కూడా టికెట్ ఇవ్వాల్సిందేననే కండిషన్ పనిచేసేది.  సో.. పార్టీని వీడిన, వీడే ఎమ్మెల్యేలకు ఈ నాలుగేళ్లు పలు ప్రయోజనాలు కలుగవచ్చేమో కానీ పొలిటికల్ ఫ్యూచర్ మీద మాత్రం భరోసా ఉండదు.