కోర్టులో కేసు పెట్టుకుని నెపం టీడీపీ మీద నెట్టడం ఏంటో !

Karanam Balaram son fires on Amanchi Krishna Mohan
వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇళ్ల స్థలాల పంపిణీ మళ్లీ వాయిదా పడిన సంగతి తెలిసిందే.  ఉగాది రోజునే 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేస్తామన్న వైకాపా సర్కార్ స్థానిక ఎన్నికల కారణంగా ఎన్నికల సంఘం అడ్డు చెప్పడంతో జూలై 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పంపిణీ చేస్తామని అంది.  కానీ 8వ తేదీకి ఇంకో రెండు రోజులు ఉందనగా పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.  ఈ వాయిదాకు కారణం ఏమిటనేది ప్రభుత్వం సరిగా చెప్పలేదు.  
 
మీడియాలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో పంపకాలు వాయిదా పడ్డాయని కథనాలు వెలువడుతుంటే ముఖ్య నేత బొత్స సత్యనారాయణ మాత్రం లోక కల్యాణం కోసం యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు ఎలా అడ్డుకున్నారో పురాణాల్లో సినిమాల్లో చూశాం.  ఈ ప్రభుత్వం మంచి చేస్తుంటే చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరులు అడ్డుకుంటున్నారు.  ఎన్ని కుతంత్రాలు, కుయుక్తులు పన్నినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆగస్ట్‌ 15న  పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తాం అంటూ మాట్లాడారు.  అంటే ఆయన ఉద్దేశ్యంలో ఈ పంపకాల మీద కోర్టులో దాఖలైన పిటిషన్లు వాయిదాకు కారణమని అనుకోవచ్చు. 
పేదల ఇళ్ల స్థాలాల పట్టాలకు కన్వేయన్సు డీడ్లు ఇవ్వకూడదనేది నియమం.  
 
కానీ ప్రభుత్వం ఇస్తామనడంతో ఆ నిర్ణయాన్ని హైకోర్ట్ తప్పుబట్టింది.  దీంతో కేసు సుప్రీం కోర్టుకు వెళ్ళింది.  అక్కడ ఎలాంటి తీర్పు వెలువడుతుందో తెలీదు.  ఒకవేళ హైకోర్ట్ అభిప్రాయాన్ని సుప్రీం బలపరిస్తే ఇచ్చిన ఇళ్ల పట్టాలు చెల్లకుండా పోతాయి.  అదే జరిగితే ప్రభుత్వానికి తలవంపులు తప్పవు.  దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం పట్టాల పంపిణీని వాయిదా వేసుకుంది.  తీర్పు సర్కారుకు సానుకూలంగా వస్తే సరే..లేదంటే ఇప్పుడు చెబుతున్న ఆగష్టు 15 కూడా ముందుకు వెళుతుంది.  నిజానికి ఇది న్యాయపరమైన కేసు.  ఇందులో ఎలాంటి మిస్ లీడింగ్స్ లేవు.  అయినా మంత్రి బొత్సగారు టీడీపీ వలనే వాయిదా వేయాల్సి వచ్చిందని అనడం వారి దాటవేత ధోరణికి నిదర్శనం.