అసలే అప్పుల ఊబిలో ఏపీ. ఇంతలో కరోనా వచ్చి అంతకంతకు ఊబిలో కూరుకుపోయేలా చేసింది. కేంద్ర ఆర్ధిక సహాయం కూడా అంతంతే. అయినా యంగ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి అదరలేదు..బెదరలేదు..కరోనా సమయంలోనూ తనదైన శైలిలో దూసుకుపోయారు. మెనిఫెస్టో లో చెప్పినట్లు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం చివరికి కరోనాని కూడా లెక్క చేయలేదు. ఏడాదిలో 90 శాతం నెరవేర్చారు. ఆర్ధిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు అమలులో యంగ్ సీఎం ఏమాత్రం వెనకడుగు వేయలేదు. రాష్ర్టాలకే ఆదర్శంగా నిలిచిన సీఎంగా జగన్ పేరు మారుమ్రోగిపోయింది. కరోనా పరీక్షలు చేయడంలోనూ దేశంలో నెంబర్ వన్ గా నిలిచింది. ఇదే సమయంలో పక్క రాష్ర్టం తెలంగాణ పరీక్షల విషయంలో ఫెయిలవ్వడం ఏపీకి మరో ప్లాస్ పాయింట్. ఇది ఏపీపై మోదీ సర్కార్ కు ఉన్న అభిప్రాయం.
సరిగ్గా ఇదే అదునుగా భావించి ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నేడు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవుతున్నారు. అప్పుల చిట్టాను పట్టుకుని ఏపీ పరిస్థితి ఏం బాగోలేదని..తమరు ఇచ్చిన 491 కోట్ల రూపాయాలు దేనికి సరిపోలేదని భేటీలో చర్చించే అకాశం కనిపిస్తోంది. రాష్ర్టంలో ప్రత్యేక అవసరాల నేపథ్యంలో భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అత్యయిక పరిస్థితుల్లో రాష్ర్టానికి 10 వేల కోట్ల వరకూ అవసరం ఉందని బుగన్న నివేదించనున్నారు.
నిర్మలా సీతారామన్ తో పాటు ఇతర కీలక అధికారులు, నీత్ ఆయోగ్ సభ్యులను బుగ్గన కలవనున్నట్లు సమాచారం. కేంద్రం ఏపీపై పాజిటివ్ గా స్పందిస్తుందనే ఉద్దేశం, నమ్మకంతోనే బుగన్న ఢిల్లీ వెళ్లినట్లు పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. కరోనా కష్ట కాలంలో జాతీయ విపత్తుగా ప్రకటించిన మహమ్మారితో ఏపీ ఎలా పోరాటం చేస్తుందో వంటి చర్యలను కేంద్రానికి వివరించి, ఎలాగైనా ఎంతో కొంత కేంద్ర నిధులు ఏపీకి తీసుకొచ్చేలా బుగ్గన పక్కా ప్రణాళికతో హస్తీనా కు వెళ్లినట్లు వినిపిస్తోంది. అలాగే సెలక్ట్ కమిటీకి వెళ్లిన బిల్లుల గురించి గుర్తు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.