అమెరికా అంటే ప్రపంచ పెద్దన్న. ప్రపంచంలోని చాలా దేశాలకు అప్పులిస్తుంది. అయితే, ఆ దేశం కూడా అప్పులు చేస్తుంది. అంతా ఇంతా కాదు. భారీ ఎత్తున అప్పులు చేస్తోంది. అభివృద్ది చెందిన దేశంగా ఉన్న అమెరికా ఇంకా అభివృద్ది చెందుతున్న దేశంగా మాత్రమే ఉన్న భారత్ దగ్గర కూడా అప్పులు చేసింది. ఆ రకంగా అమెరికా ఇప్పటి వరకు 216 బిలియన్ డాలర్ల బాకీ ఉంది. ఈ విషయాన్ని రిపబ్లికన్ పార్టీ చట్టసభ్యుడు అలెక్స్ మూనీ వెల్లడించారు. 216 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో 15 లక్షల కోట్లకు పైమాటే.
ఇప్పటివరకు అమెరికా 27.9 ట్రిలియన్ డాలర్లు బాకీ ఉందని పేర్కొన్నారు. కరోనా రిలీఫ్ ప్యాకేజీ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని వ్యతిరేకిస్తూ మూనీ ఈ వ్యాఖ్యలు చేశారు.ఒబామా ఎనిమిదేళ్ల కాలంలో అప్పులు రెండింతలు అయ్యాయి. దీంతో ప్రస్తుతం పరిస్థితి చేజారే స్థితికి చేరుకుంది. కాబట్టి ప్యాకేజీపై నిర్ణయం తీసుకునే ముందు భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నారు.
జపాన్, చైనాలకు ఒక్కో ట్రిలియన్ డాలర్ల చొప్పున బాకీ ఉన్నామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద డబ్బు లేదన్నారు. సగటున ఒక్కో అమెరికన్ 84వేల డాలర్లకు పైగా బాకీ ఉన్నాడని చెప్పారు. 2000వ సంవత్సరం నాటికి అమెరికా అప్పు 5.6 ట్రిలియన్ డాలర్లుగా ఉండేది.2050 నాటికి అమెరికా బాకీ.. 104 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని లెక్క.